ఆభరణాల తాకట్టు.. కనికట్టు
● నకిలీ నగలతో బ్యాంకుల్లో రుణాలు ● డీసీసీబీ సహా పలు బ్యాంకులకు ముఠా టోకరా ● ఉన్నతాధికారుల సూచనలతో పోలీసులకు ఫిర్యాదు ● ఆభరణాలను పరిశీలించడంలో నిమగ్నమైన అధికారులు
ఖమ్మంవ్యవసాయం: బంగారం తాకట్టు రుణాల సమయాన మోసాలు జరిగినట్లు బయటపడడంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల అధికారులు ఉలిక్కిపడ్డారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంత కాలంగా బంగారం పూతతో కూడిన కడియాలు, ఇతర ఆభరణాలను బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకున్న వైనం బయటపడింది. ఈ వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచి.. రుణం తీసుకున్న వారికి సమాచారం ఇచ్చి ఆభరణాలు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కానీ వారు అదిగో.. ఇదిగో అని వాయిదా వేస్తుండడంతో విషయం వెలుగు చూడగా.. అన్ని బ్యాంకుల్లో ఇలాంటి ఆభరణాలు తనఖా పెట్టిన వారు ఒకే ముఠా సభ్యులని గుర్తించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో...
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)కు సంబంధించి జిల్లాలోని వివిధ బ్రాంచ్‌ల్లోనే కాక ఒక గ్రామీణ బ్యాంకు, మరో జాతీయ బ్యాంకు, ఇంకో ఫైనాన్స్ సంస్థలో ఈ తరహా మోసం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కసారిగా గుప్పుమన్న ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. బ్యాంకుల ఉన్నతాధికారులు, ఫైనాన్స్ సంస్థల యజమానుల ఆదేశాలతో ఆయా సంస్థల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు. తాకట్టు పెట్టింది అసలా, నకిలీ బంగరమా అని సోమవారం నుంచి నిర్ధారించడంలో నిమగ్నమయ్యారు.
మొత్తం పరిశీలించండి..
జిల్లాలో నకిలీ బంగారం రుణాల వ్యవహారం కలకలం రేపడంతో సోమవారం పలు బ్యాంకుల ఉన్నతాధికారులు బ్రాంచ్ మేనేజర్లతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. డీసీసీబీ ఖమ్మం ఎన్‌ఎస్‌టీ, గట్టయ్య సెంటర్, ఏబీ మార్గ్, రోటరీనగర్, హెడ్డాఫీస్ తదితర బ్రాంచ్‌ల్లో ఈ తరహా వ్యవహారం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బ్రాంచ్ మేనేజర్లతో సీఈఓ వెంకటఆదిత్య సమావేశమై తొలుత నకిలీ బంగారాన్ని నిర్ధారించాలని సూచించారు. ఇదే తరహాలో గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లోనూ జరగడంతో ఉన్నతాధికారులు మేనేజర్లను అప్రమత్తం చేశారు.
పోలీసుల దృష్టికి ముఠా వివరాలు..
పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోగా.. వీరంతా ఒకే ముఠాా సభ్యులని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆధార్ కార్డులు, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా పరిశీలించగా వివరాలు బయటపడినట్లు తెలిసింది. అయితే డబ్బు చెల్లిస్తామంటూ దాటవేస్తున్న ముఠా సభ్యులు.. నకిలీ బంగారమనే విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిసి ఫోన్లు స్విచాఫ్ చేసినట్లు సమాచారం. ఇంకొందరు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసినట్లు తెలిసింది. ఖమ్మం నగరంతో పాటు, ఖమ్మం రూరల్, మరికొన్ని మండలాలకు చెందిన కొందరు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. వీరి ఆచూకీ గుర్తించేందుకు విచారణలో వేగం పెంచిన పోలీసులు మరోపక్క బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు, బంగారం పరీక్షించే అప్రైజర్లను కూడా విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రూ.5కోట్ల మేర బురిడీ..
నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టిన ముఠా సభ్యులు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు టోకరా వేసినట్లు చర్చ జరుగుతోంది. డీసీసీబీ బ్రాంచ్‌ల్లోనే రూ.30 లక్షల మేర రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోనూ పెద్ద ఎత్తున మోసం జరిగిందనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా నకిలీ బంగారంతో రూ.5 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివిధ బ్యాంకుల వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment