ధనిక జిల్లాగా మార్చడమే లక్ష్యం
చుంచుపల్లి: అభివృద్ధిలో రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లాను ఆదర్శంగా నిలపడమే కాక, ధనిక జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన చుంచుపల్లి మండలం నందతండా నుంచి వికలాంగుల కాలనీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగూడెంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని, సమకాలిక అంశాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టి ఫర్నిచర్, మౌలిక వసతులు సమకూర్చాలన్నారు. సహజ వనరులకు నిలయమైన జిల్లాలో విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే, వైద్యం, రహదారుల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు గతంలోనే కృషి చేశానని తెలిపారు. కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా హైదరాబాద్‌కు త్వరలోనే మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుందని, పాండురంగాపురం – సారపాక రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నామని వివరించారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్‌కు స్థల పరిశీలన ప్రతిపాదనలను కేంద్రానికి పంపించామన్నారు. పోలవరం పూర్తయితే నావిగేషన్‌లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, గోదావరిలో నౌకాయానం అందుబాటులోకి వస్తే అతి తక్కు వ ధరలకే రవాణా సౌకర్యం కలుగుతుందని చెప్పా రు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. గరిమెళ్లపాడులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ ఆయిల్‌పామ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు యోచిస్తున్నామని తెలిపారు. కొత్తగూడేన్ని కార్పొరేషన్ చేసేందుకు సీఎం కార్యాలయంలో చర్చించామన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం సంపూర్ణ సహకారం అందిస్తోందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టి నియోజకర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
Comments
Please login to add a commentAdd a comment