సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజనులు ఐటీడీఏలో సమర్పించే దరఖాస్తులను పరిశీలించి.. ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలోని సమావేశ మందిరంలో జరిగిన గిరిజన దర్బార్‌లో వినతులు స్వీకరించారు. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ అవసరాల కోసం కార్యాలయాలకు వచ్చే గిరిజనుల పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని సూచించారు. ములకలపల్లి మండలం చంద్రుకుంట గ్రామానికి చెందిన గిరిజనులు తమ గ్రామంలో త్రీ ఫేస్ కరెంటు సరఫరా లేదని ఫిర్యాదు చేశారని, అశ్వారావుపేట మండల ఆసుపాక గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఇళ్ల పట్టాలు కావాలని కోరారని ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, అన్నపురెడ్డిపల్లి మండలం రాయుడుపేటకు చెందిన మత్స్యకారులు చేపల సొసైటీ ఏర్పాటుకు, సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పంట పొలాలకు త్రీఫేస్ లైన్ కావాలని, బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామస్తులు జీపీఎస్ పాఠశాల ఏర్పాటు కావాలని వినతిపత్రాలు అందజేశారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు వేతనాలు చెల్లించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఎన్‌డీసీ రవీంద్రనాథ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, గురుకులాల ఆర్సీఓ నాగార్జున రావు, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ భాస్కరన్, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, విద్యుత్ ఏపీఓ మునీర్ పాషా, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏటీడీఓ అశోక్ కుమార్, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment