నాణ్యమైన భోజనం అందించాలి
కొత్తగూడెంఅర్బన్ (సూపర్‌బజార్): విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మతో కలిసి సోమవారం ఆయన పలు శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ పరిధిలో ఉన్న హాస్టళ్లను జిల్లా, మండలస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అధికారులు స్వయంగా హాస్టళ్లకు వెళ్లి, అక్కడ నెలకొన్న సమస్యలపై ఫొటోలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు. హాస్టళ్లకు సరఫరా అయ్యే బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి రిజిస్టర్లలో సంతకం చేయాలని అన్నారు. బియ్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. హాస్టళ్లలో ఉత్సాహంగా ఉండే విద్యార్థులను లీడర్‌గా నియమించాలన్నారు. విద్యార్థుల ప్లేట్లను వర్కర్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హాస్టళ్లలో సోలార్ వాటర్ హీటర్లు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీల్లో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అమృత్ సరోవర్ పథకం కింద కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment