క్షీరధారలు మరింతగా..
ఖమ్మంవ్యవసాయం: మానవాళి జీవనంలో పాలు విడదీయలేని బంధం కలిగి ఉన్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పాలు, పాల ఉత్పత్తులను ఇష్టపడతారు. పాలల్లో మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, అయోడిన్, ఐరన్, పొటాషియం, ఫోలేట్స్, విటమిన్–ఏ, డీ, రైబోఫ్లోవిన్, విటమిన్ బీ–12 సమృద్ధిగా లభిస్తాయి. దేశంలో శ్వేత విప్లవానికి పితామహుడు, పాల ఉత్పత్తిని ప్రోత్సహించిన వర్గీస్ కురియన్‌ను ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా అని పిలుస్తారు. ఆయన జయంతి అయిన నవంబర్ 26న ఏటా జాతీయ పాల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ, పాడిరైతులకు ప్రోత్సాహకాలపై కథనం.
పాల ఉత్పత్తి, సేకరణపై దృష్టి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీ ద్వారా పాడి రైతులను ప్రోత్సహిస్తూనే సేకరణ చేపడుతున్నారు. వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడం, నీటి వనరులు ఉండడంతో రైతులు పాడిపశువుల ముందుకొస్తున్నారు. తద్వారా ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా విజయ డెయిరీ ద్వారా నిత్యం 12 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. డెయిరీ సామర్ధ్యంతో పోలిస్తే ఇది తక్కువ అయినప్పటికీ గతంతో పరిశీలిస్తే మెరుగుపడిందనే చెప్పాలి. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు డెయిరీలు పుట్టగొడుగుల్లా వెలిసి రైతుల నుంచి పాల సేకరణ చేపడుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ బలోపేతానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల అనుభవం ఉన్న అధికారులు, ఉద్యోగులను నియమించడంతో రైతులకు అవగాహన కల్పిస్తూ పాల సేకరణ పెంపుపె దృష్టి సారించారు.
పాలు ప్రయోజనాలు
పాలు పిల్లలకు ప్రధాన ఆహారం. చిన్న పిల్లల ఎముకల పటిష్టతలో పాలు ఉపయోగపడతాయి. దంతాలు, మెదడుకు కూడా ముఖ్యమైన కాల్షియాన్ని అందిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమిని తొలగిస్తాయని, శక్తిని ఇవ్వడమే కాక జీర్ణక్రియను పెంచి మలబద్దకాన్ని దూరం చేస్తాయని వైద్యులు చెబుతారు.
విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తి, సేకరణ
ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే పెరిగిన సేకరణ, బిల్లుల చెల్లింపు
నేడు జాతీయ పాల దినోత్సవం
ప్రగతిబాటలో...
డెయిరీకి సంబంధించి గత కొన్నేళ్లలో జరిగిన పరిణామాలను పరిశీలించిన యాజమాన్యం సీనియర్ అధికారులకు కేటాయించింది. ప్రక్షాళనలో భాగంగా తీసుకున్న ఈ చర్యలు సత్ఫలితా లను ఇస్తున్నాయి. కొద్దినెలలుగా పాల సేకరణ గణనీయంగా పెరగడంతో పాల సేకరణ కేంద్రాలను పెంచుతున్నారు. అంతేకాక అవకాశం ఉన్న చోట డెయిరీ పార్లర్లను ఏర్పాటుచేస్తుండడంతో విక్రయాలు కూడా పెరుగుతున్నాయి.
ఈ ఏడాది జూన్ – నవంబర్‌లో డెయిరీ ప్రగతి
అంశం జూన్ నవంబర్
బల్క్ మిల్క్ సెంటర్స్ 06 06
సేకరణ (లీటర్లలో) 5,500 12,000
విక్రయాలు (లీటర్లలో) 500 7,000
ఎంపీసీఎస్ సెంటర్లు 47 51
ఎంపీఏసీ సెంటర్లు 195 205
డెయిరీ పార్లర్లు 02 05
బిల్లుల చెల్లింపు రూ.80.50 రూ.1.42
(నెలకు) లక్షలు కోట్లు
పాడికి సమృద్ధిగా వనరులు
ఈ జిల్లాలో పాడికి సమృద్ధిగా వనరులు ఉన్నాయి. వాతావరణం, నీటి వనరులు, పచ్చిక బయళ్లు పాడి పశువుల పెంపకానికి.. తద్వారా పాడి ఉత్పత్తికి ఉపయోగపడతాయి. కొందరు రైతులు ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పాడి ఉత్పత్తి ద్వారా ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ విషయంలో విజయ డెయిరీ ద్వారా మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించాం.
– మోహనమురళి, డీడీ, విజయ డెయిరీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment