ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు.
ఐఐటీలో చదివి స్టార్టప్‌ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్‌లో ఒక హోటల్‌కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్‌లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది.
ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్‌లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment