ఆ మరణాలపై ఆనంద్‌ మహీంద్రా ఆవేదన | Anand Mahindra Expresses Concern About Series Of Students Suicides In Rajasthan Kota, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఆత్మహత్యల ‘కోటా’పై.. చలించిపోయిన ఆనంద్‌ మహీంద్రా..

Published Wed, Aug 30 2023 1:27 PM | Last Updated on Wed, Aug 30 2023 1:45 PM

Anand Mahindra Expresses Concern About Series Of Students Suicides In Rajasthan Kota, Tweet Goes Viral - Sakshi

కోచింగ్‌ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌ రాష్ట్రం కోటా పట్టణంలో విద్యార్ధుల ఆత్మహత్యలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోటీ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమోనని భయం, ఫెయిల్‌ అవుతావేమోనన్న ఆందోళనలతో విద్యా కుసుమాలు రాలుతున్నాయి. తాజాగా, గంటల వ్యవధిలో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 24 మంది విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు. 

ఈ తరుణంలో కోటా విద్యార్ధుల మరణాలపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులు గురవుతున్న ఒత్తిడిపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మీరేంటో నిరూపించుకోవడం కంటే.. మీ గురించి మీరు తెలుసుకోవాలని సూచించారు.  

‘ఈ వార్త చూసి కలత చెందాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరం. పంచుకోవడానికి నా దగ్గర గొప్ప జ్ఞానం లేదు. కానీ మీ అందరికి  (కోటా విద్యార్ధులను ఉద్దేశిస్తూ) ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ దశలో మీ లక్ష్యం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు గుర్తించడం. పరీక్షలో విజయం సాధించకపోవడం అనేది కేవలం స్వీయ అన్వేషణ ప్రయాణంలో భాగం. మీ నిజమైన ప్రతిభ మరెక్కడో ఉందని అర్థం. శోధిస్తూ ఉండండి, ప్రయాణం చేస్తూ ఉండండి. చివరికి ఎందులో ప్రతిభావంతులో మీరే గుర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు. 

ఈ ఏడాది అత్యధికంగా
పలు నివేదికల ప్రకారం..కోటా పట్టణం పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రసిద్ధి. ప్రతి ఏడు ఆయా రాష్ట్రాల్లో పోటీ ప్రవేశ పరీక్షల్లో కోచింగ్‌ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు మూడు లక్షల మంది విద్యార్ధులున్నారు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రులకు భారం కాకూడదని, లక్ష్యాన్ని చేరుకుంటామో? లేదో’నని ఒత్తిడికి గురవుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ధోరణి విద్యార్ధులు మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతుంది. 

కొన్ని గంటల వ్యవధిలోనే  
ఆగస్ట్‌ 27న (గత ఆదివారం), కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులు కొన్ని గంటల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో ఇప్పటివరకు అత్యధికంగా ముక్కుపచ్చలారని 24 మంది విద్యార్ధుల జీవితాలు బలైపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement