న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది.
ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది.
మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్‌కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్‌తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు.
పీక్ 15 పార్ట్‌నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్‌బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్‌కి చెందిన రసెల్ డ్రీసెన్‌స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment