న్యూఢిల్లీ: దేశీయంగా సుస్థిరమైన విద్యుత్ వాహనాల వ్యవస్థను తీర్చిదిద్దాలంటే స్థానిక సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సమాఖ్య ఎస్‌ఎంఈవీ పేర్కొంది.
పర్యావరణహిత వాహనాల అవసరంపై ప్రజలు తమ కుటుంబాలు, మిత్రుల్లో అవగాహన పెంచాలని సూచించింది. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఎస్‌ఎంఈవీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2024 నాటికి 18,000 చార్జింగ్ స్టేషన్లను కొత్తగా నెలకొల్పాలన్న ఢిల్లీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి), ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రశంసించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా వ్యూహాలు అమలు చేయాలని కోరాయి.
ఈవీల వినియోగం పెద్ద యెత్తున పెరగాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్‌మెంట్ – ఈవీ) వీరేందర్ గోయల్ చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరుగుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ పేర్కొన్నారు. ఎంఅండ్‌ఎం వచ్చే ఏడాది జనవరిలో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ ఎక్స్‌యూవీ400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment