ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానం కోల్పోయిన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 40 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది.
బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ధనవంతుల జాబితాలో తొలిస‍్థానంలో ఉన్న మస్క్‌ను అదిగమించారు. అయితే, స‍్వల్ప వ్యవధిలో 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలిస్థానంలో ఉన్న మస్క్ ఏకంగా 108 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోవడం విశేషం.
టెస్లా షేర్ల పతనం
మస్క్ అపరకుబేరుల స్థానం నుంచి పడిపోవడానికి, ఆయన సంపద మంచులా కరిగిపోవడానికి టెస్లా షేర్లే కారణం. టెస్లాలో మస్క్‌కు 21 శాతం వాటా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా షేర్ల ధరలు అమాంతం పెరుగుతాయి. బిజినెస్ టైకూన్ సంపద సైతం పెరుగుతుంది. అదే టెస్లా కంపెనీపై ప్రతి కూల ప్రభావం ఏర్పడితే.. మస్క్ సంపదపై పడుతుంది. తాజాగా ఇదే జరిగింది.
గిగా ఫ్యాక్టరీ షట్‌డౌన్
ఈ నెల ప్రారంభంలో చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినట్లు టెస్లా రిపోర్ట్‌ను విడుదల చేసింది. మరోవైపు యూరప్‌లోని బెర్లిన్ ప్రాంతంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ సమీపంలో అల్లరి మూకలు కాల్పులు తెగబడ్డాయి. దీంతో భద్రత దృష్ట్యా.. మార్చి 17 వరకు కరెంట్ సరఫరా నిలిపివేసింది. టెస్లా కార్లలో వినియోగించే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు.
55 బిలియన్ డాలర్ల వేతనంపై అభ్యంతరం
దీనికి తోడు టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకుంటున్నాడు. మస్క్‌కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వరుస పరిణామాలతో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మస్క్ సంపద 29 శాతం తగ్గింది. 2021 గరిష్ట స్థాయి నుండి 50 శాతం పడిపోయింది. ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలు మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment