ఓ వైపు పెట్రోల్ రేట్ల మంట మరోవైపు కరోనాతో దెబ్బతిన్న వినియోగదారుల కొనుగోలు శక్తి...ఈ నేపధ్యంలోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది. విద్యుత్, వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ మార్కెట్ 2021లో మూడు రెట్లు పెరగడం ఈ– వెహికల్ పరిశ్రమకు ఓ టర్నింగ్ పాయింట్‌గా కూడా నిలిచింది.
ఈ– పరిశ్రమ 2022 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఎన్నో రెట్ల వృద్ధిని సాధించింది. వినియోగదారులలో అవగాహన పెరగడంతో పాటుగా అమ్మకాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు భారత దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్ అని రవ్నీత్ చెబుతూ, గత 12 నెలల కాలంలో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది.
నాణేనికి మరోవైపు...?
ఇలా ఈవీల పట్ల దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ఈ– పరిశ్రమకు నూతనోత్తేజం అందిస్తుంటే... మరోవైపు ఇటీవలి కాలంలో విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురై తగులబడిన సంఘటనలు జరిగాయి. ఇవి వినియోగదారులలో అనేక ఆందోళనలకూ సందేహాలకూ దారి తీశాయి. ఇది పరిశ్రమ వృద్ధికి ప్రతికూలంగానూ మారుతోందనే భయాందోళన వాహన పరిశ్రమలోనూ చోటు చేసుకుంది. ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందనే ఆందోళనతో ఉత్పత్తిదారులు ఏకీభవిస్తున్నారు.
బ్యాటరీ కీలకం...
ఈవీ వాహన వృద్ధిలో బ్యాటరీ అభివృద్ధి అత్యంత కీలకం, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈవీలకు గుండె లాంటి బ్యాటరీ ఒక్కటి బాగుంటే ఈవీ చాలా వరకూ బాగున్నట్లే. అయితే ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్ చేయకపోవడమేనని తాజాగా నిపుణులు విశ్లేషించారు.
ఈవీ పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని చూసి తగిన అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్, టెస్టింగ్, వాలిడేషన్ చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారతీయ వాతావరణ పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్ధేశించుకుంటే ఈ సమస్య ముగిసే అవకాశాలున్నాయని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఈవీలు తగలబడటానికి కారణం కాదంటూ ఉష్ణోగ్రతలు పెరిగితే వాహన సామర్ధ్యం దెబ్బతింటుందన్నారు.
అమ్మకాలపై మంటల ప్రభావం లేదు...
ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదన్నారు. వాహనాల ఉత్పత్తిసంస్థ ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోఖేలా. అయితే ఈ సమస్యలకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఎథర్ ఎనర్జీ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, టెస్టింగ్ పై తీవ్ర పరిశోధనలు చేసిందంటూ విభిన్న భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్ చేశామన్నారు రవ్నీత్.
సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్‌బాక్స్ ఐటెమ్ కాదని అది తమకు అది అతి ప్రధానమైన ఎంపికన్నారు. తమ మొదటి వాహనం 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్‌లను తాము నిర్మించామన్నారు. తమ స్కూటర్లను ఒక లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించడం జరిగిందంటూ అత్యంత కఠినమైన ప్రమాణాలను తాము అంతర్గతంగా నిర్ధేశించుకున్నామన్నారు. తాము బ్యాటరీ ప్యాక్‌లను ఇతరుల వద్ద కొనుగోలు చేయమంటూ, తామే వాటిని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నామన్నారు.
ఓ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే 4వ తరపు బ్యాటరీ ప్యాక్ విడుదల చేయబోతున్నామని ప్యాక్ లెవల్‌లో 120 పరీక్షలు, వాహన స్ధాయిలో దాదాపు 800 పరీక్షలు చేస్తామని, ఇవి కాకుండా మరిన్ని పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. అని రవ్నీత్ అన్నారు. నాణ్యత పట్ల సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, డిజైనింగ్ లోపాలు కూడా సమస్యకు కారణమవుతుందన్నారు.
జాగ్రత్తగా ఎంచుకోవాలి...
ఈవీలు తగలబడుతున్న కాలం, పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీలను ఎలా ఎంచుకోవాలనేది ప్రశ్నే అయినా కాస్త శ్రద్ధ పెడితే వీటిని ఎంచుకోవడం తేలికేనన్నారు రవ్నీత్. సవారీ చేసిన వెంటనే ఈవీలకు చార్జింగ్ పెట్టకూడదు, చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తీసేయాలి లాంటి సూచనలన్నీ వాహన డిజైనింగ్ సరిగా లేని పరిస్థితుల్లోనే వస్తాయన్నారు. బ్యాటరీ ప్యాక్ ట్యాంపర్ చేయకుండా ఉండటం, నాణ్యమైన, అధీకృత చార్జర్లు వాడటం, వాహనాలు రెగ్యలర్‌గా సర్వీస్‌చేయించడం చేస్తే సమస్యలు రాకుండా పనిచేస్తాయని ఆయన సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment