విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..
బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్‌లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు.
ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్‌లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని పైలట్‌కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు.
Comments
Please login to add a commentAdd a comment