అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తన ప్రామాణిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 5.25-5.50 శాతం వడ్డీరేట్లు 23 ఏళ్ల గరిష్ఠ స్థాయిని చేరాయి. అయినా వీటిని తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వరుసగా అయిదోసారి సమావేశంలోనూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని 2 శాతం కంటే తక్కువకు తీసుకువచ్చేలా ఫెడ్ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వడ్డీరేట్లను మార్చడం లేదంటూ ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ పలుమార్లు తెలిపారు. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.2 శాతంగా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంచనాల్లో అనిశ్చితి కొనసాగుతుండడంతో, ద్రవ్యోల్బణంపై అత్యంత అప్రమత్తతగా ఉంటున్నట్లు ఫెడ్ బుధవారం (మన కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) పేర్కొంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం దిశగా చలిస్తోందన్న విశ్వాసం వచ్చే వరకు కీలక వడ్డీరేట్లలో మార్పు ఉండదని కమిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో రేట్ల కోత వైపునకు ఫెడ్ మొగ్గు చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో అమెరికన్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ర్యాలీ గురువారం ఇండియన్ మార్కెట్లలోనూ కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment