ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తున్న ఫ్యాన్‌ టోకెన్లు! | Messi Fan Tokens Deal With PSG Explain In Telugu | Sakshi
Sakshi News home page

ఒమర్‌ నుంచి మెస్సీ దాకా! సొమ్ము కుమ్మరిస్తున్న ఫ్యాన్‌ టోకెన్లు ఎలా పని చేస్తాయంటే..

Published Sat, Aug 14 2021 9:13 AM | Last Updated on Sat, Aug 14 2021 9:33 AM

Messi Fan Tokens Deal With PSG Explain In Telugu - Sakshi

లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌తోనే కాదు.. క్రేజీ ఒప్పందాల ద్వారా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. సుదీర్ఘకాలం కొనసాగిన స్పెయిన్‌ బార్సిలోనా క్లబ్‌ను వీడి.. ఫ్రాన్స్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ క్లబ్‌తో రెండేళ్ల ఒప్పందం.. అదీ సుమారు 610 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ రెమ్యునరేషన్‌లో ఫ్రెంచ్‌ క్లబ్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ‘ఫ్యాన్‌ టోకెన్స్‌’ ప్రస్తావన రావడం చాలామందిని గందరగోళానికి గురి చేసింది. మెస్సీతో డీల్‌ గురించి చెబుతూ ‘ఫ్యాన్‌ టోకెన్స్‌’ ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని పీఎస్‌జీ క్లబ్‌ కామెంట్లు చేసింది. ఇంతకీ ఈ ఫ్యాన్‌ టోకెన్స్‌ అంటే ఏమిటి? మెస్సీతో కుదుర్చుకున్న మల్టీ మిలియన్‌ పీఎస్‌జీ ప్యాకేజీలో క్రిప్టోకరెన్సీ పాత్ర ఏంటో చర్చిద్దాం. సాకర్‌ ఆటగాళ్లకు అవి ఎలా లాభాలు ఇస్తున్నాయో చూద్దాం.


ఫ్యాన్‌ టోకెన్స్‌ ఎన్‌ఎఫ్‌టీలో ఒక రకం. నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్‌ ఆస్తులు అని అర్థం. బిట్‌ కాయిన్‌, డిజిటల్‌ కరెన్సీల మాదిరిగానే.. ఫ్యాన్‌ టోకెన్స్‌ కూడా రాత్రికి రాత్రే విలువ మారే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టొచ్చు.. లేదంటే తీవ్ర నష్టాల్ని మిగల్చవచ్చు. ఫ్యాన్‌ టోకెన్స్‌ను క్రియేట్‌ చేసేది సోసియోస్‌ అనే వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ నుంచే ఫుట్‌బాల్‌ క్లబ్‌లు తమకు కావాల్సిన రీతిలో ఫ్యాన్‌ టోకెన్స్‌లను డిజైన్‌ చేయించుకుంటాయి. ఈ టోకెన్లను ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. తద్వారా ఈ టోకెన్లకు సంబంధించిన కంటెంట్‌ను ఉపయోగించుకోవడం, లేదంటే అగుమెంటెడ్‌ రియాలిటీ గేమ్స్‌ను ఆడడం చేయొచ్చు. అంతేకాదు ఈ ఫ్యాన్‌ టోకెన్స్‌ కలిగి ఉన్నవాళ్లు.. సదరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిర్వహించే ఓటింగ్‌లలో పాల్గొనవచ్చు. ఉదాహరణకు.. కిట్‌ డిజైన్లు, గోల్‌ మ్యూజిక్‌, ప్రీ సీజన్‌ టూర్లకు ముందు వేదికలను ఖరారు చేయడం లాంటి చిన్న చిన్న నిర్ణయాల్లో ఓట్లు కీలకంగా వ్యవహరించొచ్చన్నమాట. ఎన్ని ఎక్కువ ఫ్యాన్‌ టోకెన్లు కలిగి ఉంటే.. అన్ని ఓట్లు వేసే హక్కు దక్కుతుంది ఆవ్యక్తికి. అలాంటి టోకెన్లను ఒప్పందాల్లో భాగంగా ఆటగాళ్లకు ధారాదత్తం చేస్తున్నాయి క్లబ్‌లు.
 

మెస్సీకి లాభమేనా?
మెస్సీకి ఎన్ని పీఎస్‌జీ ఎఫ్‌సీ ఎన్ని ఫ్యాన్‌ టోకెన్లు ఇచ్చిందనేది క్లారిటీ లేదు. వాటి విలువ గురించి కూడా క్లబ్‌ బహిరంగంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. సుమారు 29-35 మిలియన్‌ డాలర్ల(దాదాపు 200 కోట్ల రూపాయలకు పైనే)విలువ ఉండొచ్చని ఓ ప్రముఖ మీడియా హౌజ్‌తో పీఎస్‌జీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ లెక్క చూసుకుంటే మెస్సీ ఒప్పందం సొమ్ము అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది. ఇక మెస్సీకి క్రిప్టోకరెన్సీతో అనుబంధం కొత్తేం కాదు. 2017లో సిరిన్‌ ల్యాబ్స్‌ అనే కంపెనీ ద్వారా, కోపా అమెరికా ఎన్‌ఎఫ్‌టీతో మిలియన్ల డాలర్లు వెనకేసుకున్నాడు. ఇక మెస్సీవర్స్‌ అనే తన కలెక్షన్లతో నాలుగు డిజిటల్‌ ఆర్ట్‌ వర్క్స్‌(ఫ్యాన్స్‌ కొనుగులు చేసుకోవచ్చు) ద్వారా కూడా సంపాదించుకుంటున్నాడు. చెస్‌ థీమ్‌​, గ్రీక్‌ మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ థీమ్‌ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. మరొక డిజిటల్‌ ఆర్ట్‌ వర్క్‌ ఏంటన్నది ఆగస్టు 20న రివీల్‌ చేయనున్నారు. 

హాట్‌ న్యూస్‌: ఇక బరిలో దిగుతానో? లేదో?

ఎంత లాభమంటే..
మెస్సీ పీఎస్‌జీలో చేరాడన్న వార్త తర్వాత క్లబ్‌ క్రిప్టో కాయిన్‌(ఫ్యాన్‌ టోకెన్‌) విలువ అమాంతం పెరిగింది. జూన్‌లో పీఎస్‌జీ ఫ్యాన్‌ ఒక టోకెన్‌ విలువ 11.93 డాలర్లు ఉండగా.. గురువారం సాయంత్రం నాటికి ఆ విలువ 43.91 డాలర్లుకు చేరుకుంది. ఇక ట్రేడ్‌ విలువ మొత్తం సుమారు 1.2 బిలియన్‌ డాలర్లకు(సుమారు 9 వేల కోట్ల రూపాయలు) చేరిందని, మెస్సీ క్రేజ్‌తో డిజిటల్‌ రెవెన్యూలో మున్ముందు మరిన్ని అద్భుతాలను ఆశిస్తున్నామని పీఎస్‌జీ ప్రతినిధి మార్క్‌ ఆర్మ్‌స్రా‍్టంగ్‌ వెల్లడించారు.

మరికొన్ని టీంలు 
ఫ్యాన్‌ టోకెన్ల వల్ల సాలీనా 200 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ జనరేట్‌ అవుతోందని సోషియోస్‌ చెబుతోంది. అర్సెనెల్‌, అస్టోన్‌ విల్లా, ఎవర్టోన్‌, లీడ్స్‌, మాంచెస్టర్‌ సిటీ, బార్సెలోనా, ఏసీ మిలన్‌, ఇంటర్‌ మిలన్‌, జువెంటస్‌, పీఎస్జీ, పోర్చుగ్రీస్‌ నేషనల్‌ టీం.. ఇలా కొన్ని జట్లు ఫ్యాన్‌ టోకెన్ల ఒప్పందాలను ఆటగాళ్లతో కొనసాగిస్తున్నాయి. కిందటి ఏడాది జూన్‌లో బార్సిలోనా ఫస్ట్‌ బ్యాచ్‌ ఫ్యాన్‌ టోకెన్‌ ప్రారంభించగానే.. రెండు గంటల్లోనే అవన్నీ అమ్ముడుపోయి. దీంతో మిలియన్నర డాలర్ల ఆదాయాన్ని వచ్చింది క్లబ్‌కి.
   
కొత్తేం కాదు
2018లో టర్కీష్‌ క్లబ్‌ హరునుస్టాస్పోర్‌ బిట్‌కాయిన్‌ ఒప్పందం ద్వారా ఓ ఆటగాడితో ఒప్పందం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఒమర్‌ ఫారూఖ్‌ అనే ప్లేయర్‌కి 0.0524 బిట్‌కాయిన్‌తో పాటు 2,500 టర్కీష్‌ లీరాలు ఒప్పందంలో భాగంగా చెల్లించింది. ఆపై స్పెయిన్‌ ఆటగాడు డేవిడ్‌ బారోల్‌ను కేవలం క్రిప్టో కరెన్సీ ఉపయోగించి ఒప్పందం చేసుకోవడం విశేషం. అయితే తమ ఆటగాళ్ల కోసం పూర్తిస్థాయిలో క్రిప్టో కరెన్సీని మూడేళ్ల క్రితమే ఉపయోగించినట్లు గిబ్రాల్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ప్రకటించుకోవడం విశేషం.
- సాక్షి, వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement