న్యూఢిల్లీ: నష్టాలు నమోదు చేస్తూ పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న కంపెనీలను కట్టడి చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. దీనిలో భాగంగా ఆయా కంపెనీలు ఇకపై ఐపీవోల కోసం దాఖలు చేసే ప్రాస్పెక్టస్‌లో మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ అంశాలపై సవరించిన తాజా ప్రతిపాదనలను కన్సల్టేషన్ పేపర్ ద్వారా సెబీ ప్రజల ముందుంచింది. వీటిపై మార్చి 5లోగా అభిప్రాయ సేకరణను పూర్తిచేయనుంది. ఇటీవల పలు ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు నష్టాలు నమోదు చేస్తూ పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న సంగతి తెలిసిందే. నష్టాలు సాధిస్తున్న కంపెనీలు పనితీరుకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను ప్రాస్పెక్టస్‌లో వెల్లడించవలసి ఉంటుంది.
ప్రాస్పెక్టస్ ఇలా..
నష్టాలు నమోదు చేస్తున్న కంపెనీలు ప్రాస్పెక్టస్‌లో ఐపీవో ధర నిర్ణాయక ప్రాతిపదికను తెలియజేయవలసి ఉంటుంది. దీంతోపాటు కొత్త షేర్ల జారీ, అంతక్రితం 18 నెలల్లో కొనుగోలు చేసిన షేర్లకి సంబంధించిన విలువ నిర్ధారణపైనా వివరాలు అందించవలసి ఉంటుంది. కనీసం గత మూడేళ్లలో నిర్వహణ లాభాలు ఆర్జించని ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు ఇటీవల పబ్లిక్ ఇష్యూలు చేపడుతున్న విషయం విదితమే. ఇలాంటి సంస్థలు సహజంగానే తొలినాళ్లలో లాభాలు ఆర్జించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కస్టమర్లను పొందడంపై దృష్టిపెడుతున్నాయి. తద్వారా కార్యకలాపాల విస్తరణకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఈ కంపెనీలు నష్టాలు నమోదు చేయడమేకాకుండా బ్రేక్‌ఈవెన్(లాభనష్టాలులేని) పరిస్థితి సాధించేందుకు దీర్ఘకాలం వేచిచూడవలసి వస్తోంది.
సవరణలు ఇలా
ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ధర నిర్ణయంలో కంపెనీ ఖాతాల ఈపీఎస్, నెట్‌వర్త్, ఎన్‌ఏవీ, పోటీ సంస్థలతో పోలిక వంటి కీలక అంశాలను పొందుపరిచేందుకు వీలుగా ప్రాస్పెక్టస్‌ను రూపొందిస్తున్నారు. సెబీ అభిప్రాయం ప్రకారం ఇవి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలకు మాత్రమే అనువుగా ఉంటున్నాయి. నష్టాలు నమోదు చేస్తున్న కంపెనీలు తగిన వివరాలు పొందుపరిచేందుకు అనువుగా ఉండటంలేదు. దీంతో ‘ఇష్యూ ధర నిర్ధారణకు ప్రాతిపదిక’ పేరిట తగిన వివరాలు ఇచ్చేలా ప్రాస్పెక్టస్‌కు రూపకల్పన చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ, షేర్ల జారీలో కంపెనీ విలువ మదింపు తదితర కీలక వివరాలను అందించవలసి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ గత మూడేళ్ల పనితీరుకు సంబంధించిన వివరాలు సైతం సమగ్రంగా దాఖలు చేయవలసి ఉంటుంది. వెరసి ఇష్యూ ధర నిర్ణయంలో ఇవి ఏవిధంగా ప్రభావం చూపినదీ వెల్లడించలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment