నాకు వారసత్వంగా వచ్చిన ఫండ్స్ ప్రస్తుత విలువ రూ.10 లక్షలు. కానీ, వాటిని కొనుగోలు చేసిన సమయంలో చేసిన పెట్టుబడి రూ.5 లక్షలే. నేను విక్రయించే సమయంలో రూ.15 లక్షలు ఉంటే అప్పుడు మూలధన లాభాల పన్నును ఎలా లెక్కిస్తారు? వాస్తవంగా కొనుగోలు చేసిన ధర నుంచి చూసి పన్ను చెల్లించాలా..? లేక నాకు బదిలీ అయిన నాటి విలువనే పరిగణనలోకి తీసుకుంటారా? – తరుణ్
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారు మరణిస్తే ఆ యూనిట్లను నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేస్తారు. ఇలా ఒకసారి బదిలీ చేసిన తర్వాత పన్ను అంశంపై సందేహం ఏర్పడడం సహజమే. అదృష్టవశాత్తూ మనదేశంలో వారసత్వ పన్ను లేదు. మీ తల్లిదండ్రులు లేదా మరొకరి నుంచి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు మీకు బదిలీ అయితే పన్ను చెల్లించక్కర్లేదు. కాకపోతే ఆ యూనిట్లను విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించినప్పుడు ఉండే బాధ్యతలే మీకు వర్తిస్తాయి. మూలధన లాభాల పన్ను విషయానికొస్తే ఆ పెట్టుబడిని ఎంత కాలం కొనసాగించారు (అసలు కొనుగోలు నాటి నుంచి) అనే దాని ఆధారంగా నిర్ణయానికి రావాలి. ఇక్కడ అసలు మొదట కొనుగోలు చేసిన తేదీనే పన్ను కోసం పరిగణనలోకి తీసుకుంటారు. మీకు బదిలీ అయిన తేదీ లెక్కలోకి రాదు.
ఉదాహరణకు రవి తండ్రి రూ.5 లక్షలను ఓ పథకంలో 2019లో ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం. అప్పుడు అతని తండ్రి యూనిట్‌దారు అయితే, రవి నామినీ అవుతారు. దురదృష్టవశాత్తూ రవి తండ్రి గతేడాది మరణించారు. ఆయన పేరిట ఉన్న యూనిట్లు రవికి బదిలీ అయ్యాయి. బదిలీ అయ్యే నాటికి ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు వాటి విలువ రూ.7.80 లక్షలు ఉంది. రవి ఆ పెట్టుబడులను విక్రయించాలని అనుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడులను 2019 నుంచి కొనసాగించినట్టు చూస్తారు. ఈక్విటీ పథకంలో పెట్టుబడులు కనుక హోల్డింగ్ పీరియడ్ ఏడాదికిపైనే ఉంది. లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. మొదటి రూ.లక్ష లాభాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 10 శాతాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విక్రయించే నాటి విలువ రూ.7.80 లక్షల్లో పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయిస్తే అప్పుడు లాభం రూ.2.80 లక్షలు అవుతుంది. రూ.లక్ష లాభం మినహాయిస్తే, మిగిలిన రూ.1.80 లక్షల లాభంపై 10 శాతం పన్ను చొప్పున రూ.18,000 చెల్లించాలి.
ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ గణేశ్
ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసేది. వాటి పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ లేదా ఈక్విటీల్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్‌వోఎఫ్‌ల్లోనూ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు వేరే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండంచెల్లో ఎక్స్‌పెన్స్ రేషియో భారాన్ని మోయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్‌పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్‌పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్‌పెన్స్ రేషియో భరించాలని అర్థం చేసుకోవాలి. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లు నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment