బ్రిటన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది.
బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్‌లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది.
సంక్షోభానికి కారణమదే..
"సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్‌వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు.
2012లో బర్మింగ్‌హామ్ కౌన్సిల్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్‌లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment