మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
కార్వేటినగరం : స్కిల్ స్కామ్‌కు పాల్పడి ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు జీవితం ఇక జైలుకే పరిమితమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని అన్నూరులో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా అవినీతికి పాల్పడిందుకే చంద్రబాబు జైల్లో కటకటాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కోర్టుల్లో కులం కార్డు ఉపయోగపడదని వెల్లడించారు. అవినీతి పరుడు చంద్రబాబును అరెస్టు చేస్తే రేణుకా చౌదరి ఎందుకు ఉలిక్కిపడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. పాపాలను తుడిచేసుకునేందుకు రూ.కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకున్నా ప్రయోజనం ఉండదని తెలిపారు. కాపు జాతి కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు హింసించినప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని మండిపడ్డారు. అయితే తప్పులు చేసి ఊచలు లెక్కిస్తున్న ఘనుడిని కాపాడుకునేందుకు పవన్ తపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అన్నదాతలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్, ఎల్లోమీడియాకు ఎందుకింత కక్ష అని నిలదీశారు. జగనన్న తన తండ్రి ఫొటోతో పాదయాత్ర చేశారని, అందుకే ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఎన్టీఆర్ ఫొటో, ఆయన స్థాపించిన టీడీపీని వదిలేసి సొంత పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఖర్జూరనాయుడు, లోకేష్ ఫొటో పెట్టుకుని ఒక్క సీటు గెలుపొందినా చంద్రబాబునే ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment