● పరామర్శల పేరుతో ఫొటోలకు ఫోజులిచ్చిన
సీఎం, డెప్యూటీ సీఎం
● తూతూమంత్రంగా బాధితుల పరామర్శ
తిరుపతి అర్బన్/తిరుపతి గాంధీరోడ్డు : భక్తులకు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ముఖ్యనేతలు సీఎం చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పరామర్శల పేరుతో షో చేసి వెళ్లడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా .. ఆరుగురు భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాక అధికారులపై చిందులేయడమేంటని మండిపడుతున్నారు. గురువారం తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాలను వారు పరిశీలించారు. భక్తుల తోపులాటకు గురైన ఘటనా స్థలాలను పరిశీలిస్తున్న సందర్భంగా వారు ప్రవర్తించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. కేవలం టీవీలు, పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చేందుకు మాత్రమే వారు ప్రాధాన్యత ఇచ్చారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా తూతూమంత్రంగా పరామర్శించారని మండిపడుతున్నారు. మృతుల కుటుంబాలకు మేమున్నామని భరోసా నివ్వాల్సిన నేతలు కేవలం కంటితుడుపుగా కన్నీళ్లు తుడిచి వెళ్లారని పేర్కొంటున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారు చనిపోవడం.. వారికి మొక్కుబడిగా ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే వారి ప్రాణాలు పోయాయని, ఒక్కో కుటుంబానికి కనీసం రూ.50 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు టీటీడీలోనే ఉద్యోగాలు కల్పించాలని సూచిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీలో రాజకీయ నేతల అడుగులకు మడుగులొత్తుతూ సాధారణ భక్తులను గాలికొదిలేయడం బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment