ఏమారితే ఖాతాలో నగదు ఖాళీ! | - | Sakshi
Sakshi News home page

ఏమారితే ఖాతాలో నగదు ఖాళీ!

Published Sat, Sep 7 2024 2:50 AM | Last Updated on Sat, Sep 7 2024 2:50 AM

ఏమారితే ఖాతాలో నగదు ఖాళీ!

● లాటరీలో కోట్లు తగిలాయని సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు ● ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన లేక డబ్బులు కోల్పోయి లబోదిబో

పలమనేరు: లాటరీ తగిలిందంటూ ఆన్‌లైన్‌లో సైబర్‌ కేటుగాళ్లు కొన్నేళ్లుగా చేస్తున్న మోసాలు కొత్తేమీ కాదు. వీటి గురించి ఎన్నో పర్యాయాలు పోలీస్‌ శాఖ హెచ్చరించిననూ ఇప్పటికీ కొందరు అవగాహన లేక చేతులు కాల్చుకుంటున్నారు. తీరా తాము మోసపోయామని గ్రహించాక బావురుమంటున్నారు. పట్టణంలోని రమేష్‌ అనే వ్యక్తి మొబైల్‌కు పదిరోజుల క్రితం ఓ ఆగంతకుని నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. యూకే కోకకోలా కంపెనీ నుంచి మీకు రూ.90 లక్షలు లాటరీ మీ నంబరుకు తగిలిందని..ఇందుకోసం వివరాలను పంపాలని అందులో సారాంశం. దీంతో ఆశపడిన రమేష్‌ తన బ్యాంకు ఖాతా, ఏటీఎం, బ్రాంచి కోడ్‌ తదితరాలను వారి మెయిల్‌కు పంపాడు. అంతే గంట తర్వాత అతని మొబైల్‌కు ..ఖాతాలో ఉన్న రూ.14,600 ఖాళీ అయినట్టు సందేశం వచ్చింది. దీంతో లబోదిబోమంటూ బాధితుడు తనలా మరొకరు మోసపోరాదని మీడియాకు సమాచారమిచ్చాడు. అలాగే, పలమనేరు మండలానికి చెందిన నాయుడు మొబైల్‌కు మూడు రోజుల క్రితం ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. రూ.3.6 కోట్ల యూకే లాటరీ తగిలిందని, వెంటనే అడిగిన సమాచారంతోపాటు డీడీ పంపాలని అందులో ఉంది. ఒక్కసారిగా అంత డబ్బే..! అని నాయుడు తెగ ఖుషీ అయ్యాడు. దీంతో నాయుడు అదే రోజు సాయంత్రం అందులోని నంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఆవలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో అతడికి అర్థం కాలేదు. తనకు తెలుగు మాత్రమే వచ్చని బదులివ్వడంతో మళ్లీ తామే కాల్‌ చేస్తామంటూ కాల్‌ కట్‌ చేశారు. కొంతసేపటికి ఓ అమ్మాయి నాయుడికి మొబైల్‌కు ఫోన్‌చేసి తెలుగులో మాట్లాడింది. ఇప్పటికే సమయం మించిపోయిందని, లాటరీలోని డబ్బు పొందాలంటే తాము చెప్పిన చిరునామాకు రూ.10వేలు పంపితే వారం రోజుల్లో రూ.3కోట్లు మూడు ఖాతాలో జమ అవుతాయని నమ్మబలికింది. దీంతో వాళ్లు చెప్పిన నెంబరుకు పదివేలు పంపాడు. ఆపై రోజూ ఏటీఎంకు వెళ్ళడం బ్యాలెన్స్‌ చూసుకోవడం మొదలెట్టాడు.. శుక్రవారం సైతం పరిశీలించుకున్నా డబ్బు జమ కాకపోవడంతో అనుమానించాడు. తనకు వచ్చిన ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేశాడు. అవి ఉలుకూపలుకూ లేకుండా పోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. ఇలాంటి ఘటనల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంతవరకై నా సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement