ఒక్కటీ పనికొచ్చేలా లేవు | Lack of mechanics to repair vehicles | Sakshi
Sakshi News home page

ఒక్కటీ పనికొచ్చేలా లేవు

Published Wed, Sep 4 2024 4:52 AM | Last Updated on Wed, Sep 4 2024 4:52 AM

Lack of mechanics to repair vehicles

మూడు రోజులుగా ముంపులోనే కార్లు, ఆటోలు, మోటార్‌ సైకిళ్లు 

2 లక్షల ద్విచక్ర వాహనాల్లో ఒక్కొక్కటీ మరమ్మతుకే రూ.10 వేలకు పైగా ఖర్చు 

దాదాపు 50 వేల కార్లను బాగుచేయాలంటే ఒక్కోదానికి రూ.లక్షకుపైగా వ్యయం 

ఇన్ని వాహనాల మరమ్మతులకు మెకానిక్‌ల కొరత

(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షిప్రతినిధి) :  సింగ్‌నగర్‌లో నివసించే మేడా మరియమ్మ కుమారుడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరదలో ఆ ఆటో కొట్టుకుపోయింది.  మా కుటుంబానికి అదే జీవనాధారం. ఇకపై మేమెలా బతకాలంటూ మరియమ్మ ఆందోళన చెందుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు జీవనాధారం వారి వాహనాలు. అప్పులు చేసి, నెలనెలా వడ్డీలు కడుతూ వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారిని వరద చావుదెబ్బ కొట్టింది.

బుడమేరు వరదల్లో దాదాపు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు నీటమునిగాయని అంచనా. అలాగే సుమారు 50 వేల కార్లు, మరో 10,000 ఆటోలను వరద నీరు ముంచేయడంతో అవేవీ ఇప్పుడు పనిచేసేలా లేవు. నీరు లోపలి వరకూ వెళ్లిపోవడంతో బీఎస్‌6 వాహనాల్లో సెన్సార్లు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని మెకానిక్‌లు చెబుతున్నారు. 

సాధారణ ద్విచక్ర వాహనాన్ని బాగు చేయడానికే రూ.10 వేల వరకూ ఖర్చకానుంది. ఇక కారుకైతే రూ.లక్షల్లో మదుపు పెట్టాల్సిందేనంటున్నారు. అసలు ఇన్ని లక్షల వాహనాలను ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయాలన్నా కూడా మెకానిక్‌లు సరిపడా దొరికే అవకాశం లేదు.  

స్టార్ట్‌ చేస్తే పనిచేయవ్‌
నీటిలో మునిగిన వాహనాలను స్టార్ట్‌ చేయకుండా మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. అందులోని పెట్రోల్, ఇంజిన్‌ ఆయిల్‌ తీసేసి, ట్యాంకు మొత్తం శుభ్రం చేసి, పెట్రోల్, ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుకుంటే వాహనం పనిచేయెచ్చు. 

అలాకాకుండా ముందే వాహనాన్ని స్టార్ట్‌ చేస్తే ఇక అది పనిచేయదు. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌  బ్యాటరీలో షార్ట్‌ సర్క్యూట్‌  అయితే కాలిపోతాయి. కార్లకు సెన్సార్‌ కంప్లైంట్లు ఎక్కువగా వస్తాయి. ఒక్కో సెన్సార్‌ రూ.25 వేల పైనే ఉంటుంది.–చంద్ర, బైక్‌ మెకానిక్, సత్యనారాయణపురం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement