రెయిలింగ్‌ను ఢీకొని మోటార్‌ సైకిస్టుకు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రెయిలింగ్‌ను ఢీకొని మోటార్‌ సైకిస్టుకు తీవ్రగాయాలు

Published Sat, Sep 7 2024 2:50 AM | Last Updated on Sat, Sep 7 2024 2:50 AM

రెయిలింగ్‌ను ఢీకొని మోటార్‌ సైకిస్టుకు తీవ్రగాయాలు

బంగారుపాళెం: రెయిలింగ్‌ను ఢీకొని మోటార్‌ సైక్లిస్టు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలోని పాలేరు వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం..బెంగళూరుకు చెందిన జాన్‌ శామ్యూల్‌(28)ద్విచక్రవాహనంపై గంగాధరనెల్లూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపు తప్పి పాలేరు వద్ద జాతీయ రహదారి పక్కన రెయిలింగ్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి శామ్యూల్‌ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

పాకాల : గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోసీఐ మద్దయ్య ఆచారి వివరాలను వెల్లడించారు. దామలచెరువు పంచాయతీ రాజీవ్‌ కాలనీకి చెందిన భాస్కరయ్య కమారుడు చంద్రశేఖర్‌ జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో స్కూటర్‌ దొంగతనాలకు పాల్పడే మద్దనపల్లెకు చెందిన సూర్యప్రకాష్‌తో స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జూన్‌ నెల 11వ తేదీ దామలచెరువు సమీపంలో పెదరాయని చెరువు వద్ద ఇరువురు మద్యం సేవించి రూ.3 వేలు అప్పు విషయంలో గొడవ పడ్డారు. చంద్రశేఖర్‌ పక్కనే ఉన్నరాయితో సూర్యప్రకాష్‌పై దాడి చేసి చంపేసి పరారయ్యాడు. గురువారం ఉప్పరపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జ్‌ సమీపంలో నిందితుడు ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చంద్రశేఖర్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, మెజిస్ట్రేట్‌ ముందు ముద్దాయిని హాజరు పరచనున్నట్లు సీఐ వెల్లడించారు. మృతుడు సూర్యప్రకాష్‌పై పలు స్కూటర్‌ చోరీ కేసులు, ఒక హత్యాయత్నం కేసు ఉన్నట్లు వివరించారు.

తిరుమలలో ఇద్దరి ఘర్షణ

తిరుమల: తిరుమలలో ఇద్దరు వ్యక్తులు టీ కోసం ఘర్షణకు దిగిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్‌ పీఎస్‌ సీఐ మురళీమోహన్‌రావు తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా, సుండుపల్లెకు చెందిన ఉదయకుమార్‌ తిరుమలలో టీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే అనంతపురం జిల్లా కదిరికి చెందిన నర్సింహులు మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. సాయంత్రం కౌస్తుభం అతిథిగృహం వద్ద ఉదయకుమార్‌ నుంచి టీ కొనుగోలు చేసిన నర్సింహులు టీ నాణ్యత బాగాలేదని డబ్బులు ఇవ్వనని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో నర్సింహులు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ మేరకు ఉదయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement