బోయకొండ గంగమ్మకు పట్టువస్త్రాలు
చౌడేపల్లె: జిల్లాలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం ఎమ్మెల్యే దంపతులు బోయకొండకు రాగా ఆలయ మర్యాదల ప్రకారం మేళతాళాల నడుమ వేదపండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయంలో సరస్వతిదేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారికి పెద్దిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన గర్భాలయం కింద ఉన్న మూలస్థానం, రణభేరి గంగమ్మ ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితులచే పెద్దిరెడ్డి దంపతులతో పాటు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డికి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఈఓ అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
ఐదేళ్లలో రూ.500 కోట్లతో బోయకొండను అభివృద్ధి చేశాం
పవిత్ర పుణ్యక్షేత్రమైన బోయకొండను వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రూ.500 కోట్లు ఖర్చుచేసి ఊహించని రీతిలో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వందల కోట్లు ఖర్చు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించామన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఈ జిల్లావారేనని ఇంకా శ్రద్ధ తీసుకొని ఈ ఐదేళ్లలో గతంలో కంటే ఎక్కువగా బోయకొండ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు అనేక తప్పులు చేశారన్నారు. ఆ తప్పులన్నీ సర్దుబాటు చేసుకుని వారి బతుకుదెరువు కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లె, సదుం జెడ్పీటీసీ సభ్యులు దామోదరరాజు, సోము శేఖర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు మిద్దింటి శంకర్ నారాయణ, నాగరాజారెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● సంప్రదాయబద్ధంగా సారెసమర్పించిన పెద్దిరెడ్డి దంపతులు
Comments
Please login to add a commentAdd a comment