పకడ్బందీగా వారోత్సవాలు
చిత్తూరు కలెక్టరేట్ : గ్రంథాలయ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఆయన మంగళవారం గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ 57వ గ్రంథాలయ వారోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని చెప్పారు. తద్వారా గ్రంథాలయ గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీ బాషా తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అభ్యర్థులు జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ.1 లక్ష లోపు ఉండాలని తెలిపారు. టీటీసీ, టెట్ పూర్తి చేసిన అభ్యర్థులు శిక్షణకు అర్హులన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో 75 శాతం హాజరు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్‌కు రూ.1000 అందజేస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు మార్కు ల జాబితాలు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం, 3 ఫొటోలు జత చేసి ఈ నెల 15వ తేదీలోపు కలెక్టరేట్‌లోని అంబేడ్కర్ భవనంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖలో అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు 85200 04646, 91774 29494ను సంప్రదించాలని డీడీ కోరారు.
సర్వేపై అవగాహన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : పరిశ్రమల వార్షిక సర్వేపై అవగాహన ముఖ్యమని జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) సాంబశివారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ వస్తూత్పత్తి రంగ పరిశ్రమల వాటా అంచనా వేయడంలో అవగాహన ముఖ్యమన్నారు. వస్తు ఉత్పత్తి రంగంలో ఉన్న వ్యవస్థీకృత పరిశ్రమలకు సంబంధించి 2023–24 పరిశ్రమల వార్షిక సర్వే ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నారు. పారిశ్రామిక యూనిట్లు, బీడీ, సిగార్ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రిజిస్టర్ లోని వస్తు ఉత్పత్తి రంగ పరిశ్రమలు సర్వే పరిధిలోకి వస్తాయన్నారు. ఈ వర్క్‌షాప్‌లో వైఎస్‌ఆర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ప్రాతీయ కార్యాలయం ఉపసంచాలకులు శ్రీనివాసరావు, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌లు ప్రశాంతి, శ్వేత, గోపాలరావు, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment