సెల్ టవర్ ఏర్పాటుపై నిరసన
రొంపిచెర్ల: మండలకేంద్రంలోని చిన్న మశీదువీధిలో ఇళ్ల మధ్యలో గురువారం ఓ టెలికాం కంపెనీకి చెందిన సెల్‌టవర్ ఏర్పాటు చేస్తుండడంపై మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తాము బీడీ పని చేసుకుని జీవిస్తున్నామని, ఇప్పటికే తమ ఆరోగ్యాలు అంతంతమాత్రం ఉన్నాయని, దీనికి తోడు ఇళ్ల మధ్య సెల్‌టవర్ ఏర్పాటు చేస్తే తాము మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ సుమిత్రకుమార్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే రాత్రికి రాత్రే దౌర్జన్యంగా పనులు మొదలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని సెల్ టవర్ పనులను నిలిపేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
నలుగురికి జైలు
గుడుపల్లె: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురికి కుప్పం కోర్టు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. గురువారం కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలోని చప్పిడిగరుగులు వద్ద రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో నలుగురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కుప్పం కోర్టులో జడ్జి ముందు హాజరు పరచగా, ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే ముగ్గురికి మూడు రోజులు, ఒకరికి మాత్రం 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment