రుణాల మంజూరులో అలసత్వం వద్దు
● అర్హులకు పీఎం విశ్వకర్మ రుణాలు మంజూరు చేయండి ● బ్యాంకర్లతో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ సమీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజనా పథకం లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు అలసత్వం వహించకూడదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఈ పథకంలో అర్హులకు న్యాయం చేయాలని, వారికి 5 శాతం వడ్డీకి రూ.3 లక్షల రుణం అందిస్తారన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతివృత్తులను ఉపయోగించి పనిచేసే కళాకారుల వృత్తులను బలోపేతం చేసేందుకు పథకం అమలు చేస్తున్నారన్నారు. చేతివృత్తులు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచి దేశీయ, గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. పథకంలో అర్హులైన వారికి 5 శాతం వడ్డీతో తొలి విడత రూ.1 లక్ష, రెండవ విడతలో రూ.2 లక్షల వరకు రుణం అందిస్తారన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రవికుమార్ నాయుడు, మెప్మా పీడీ రాధమ్మ, ఎల్‌డీఎం హరీష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి, డీఐసీ జీఎం చంద్రశేఖర్ తదితర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment