● ఏడు దశాబ్దాల కిందట ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు
నగరి : భాష ప్రాతిపదికన ఏడు దశాబ్దాల క్రితమే రాష్ట్రాలు విడిపోయాయి. 1956 వరకు ఒక్కటిగా ఉన్న ప్రాంతం ఆ ఏడాది రెండుగా విడిపోయి తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం, తమిళ భాష ప్రాతిపదికన తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. నివాసిత ప్రాంతం మధ్య సరిహద్దు రేఖ వచ్చింది. పరిస్థితుల దృష్ట్యా తెలుగు మాతృభాషగా ఉన్న కుటుంబాలు తమిళనాడులో, తమిళం మాతృభాషగా ఉన్న కుటుంబాలు మన రాష్ట్రంలోనూ స్థిరపడాల్సి వచ్చింది. ప్రాంతాలపై సరిహద్దు వేసిన ప్రభుత్వాలు మాతృభాషపై ప్రజలకు ఉన్న మమకారంపై సరిహద్దు వేరు చేయలేకపోయింది. రాష్ట్రాలు వేరై ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ వారు మాతృభాషనే అభ్యసిస్తున్నారు. వీరి మాతృభాషా అభిమానాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు సరిహద్దుల్లో రెండు మాధ్యమాలు ఉన్న పాఠశాలలను నడుపుతూనే ఉన్నాయి.
సరిహద్దుల్లోనే ఎక్కువ..
మన రాష్ట్ర సరిహద్దును ఆనుకుని తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని బోధించే 391 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 60 ఉన్నత పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 11,028 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమం అభ్యసిస్తున్నారు. 786 మంది ఉపాధ్యాయులు తెలుగును బోధిస్తున్నారు. అలాగే తమిళనాడు సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో తమిళ మాధ్యమం కలిగిన 15 ఉన్నత పాఠశాలలు, 36 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత స్కూళ్లు, 3 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 10 వేల మంది విద్యార్థులు తమిళ మాధ్యమం అభ్యసిస్తున్నారు. 252 మంది ఉపాధ్యాయులు తమిళ భాషను బోధిస్తున్నారు. ఇలాఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకునేందుకు సహకారం అందిస్తున్నాయి. దీంతో మాతృభాష హద్దులు దాటి తనకంటూ ఒక ప్రత్యేక బంధాన్ని పెనువేసుకుంది.
రాష్ట్ర భాష తప్పనిసరి..
సరిహద్దును ఆనుకుని మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో తమిళం బోధించినా సెకండ్ లాంగ్వేజిగా తెలుగు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వారికి తెలుగులో పాస్ మార్కులు వందకు 20 మాత్రమే. సరిహద్దును ఆనుకుని తమిళనాడులో ఉన్న పాఠశాలల్లో తెలుగు చదివే విద్యార్థులు తప్పనిసరిగా ఒక లాంగ్వేజ్ తమిళం చదవాల్సిందే. పాస్ కావాలంటే 35 మార్కులు సాధించాల్సిందే.
పుస్తకాల పంపిణీ ఇలా..
తమిళనాడులో అన్ని తరగతులకు కేటాయించిన సిలబస్‌ను అనుసరించి పాఠ్యాంశాలను తెలుగులోకి అనువదించి రాష్ట్ర ప్రభుత్వమే పుస్తకాలను అందజేస్తుంది. మన రాష్ట్రంలో తమిళ పాఠ్యాంశం మినహా ఇతర పాఠ్యాంశాల పుస్తకాలు మన ప్రభుత్వమే అనువదించి అందజేస్తుంది. తమిళ పాఠ్యాంశానికి మాత్రం తమిళనాడు నుంచి సీడీలు తెచ్చి ఇక్కడ ముద్రించి ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పుస్తకాలు అందడంలో ఆలస్యమవుతుండడంతో గత మూడేళ్లు అప్పటి మంత్రిగా ఉన్న ఆర్కేరోజా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించి సీడీలకు బదులుగా పుస్తకాలే తెచ్చి అందజేశారు. ఈ ఏడాది తమిళ విద్యార్థులకు అవసరమైన తమిళ పాఠ్యాంశ పుస్తకాలు ఇంకా అందలేదు.
తెలుగు చక్కగా బోధిస్తున్నారు
మాది తెలుగు మాట్లాడే కుటుంబం. నివశించేది తమిళనాడులోనే అయినా మాట్లా డేది తెలుగే. మాకు బంధువు లు కూడా ఎక్కువగా ఆంధ్రలోనే ఉన్నారు. దీంతో మా తల్లిదండ్రులు తెలుగులోనే చదివించాలనుకున్నారు. ఇక్కడే తెలుగు భాష నేర్పిస్తుండడంతో కీచలం స్కూల్ లో చేరి తెలుగులోనే చదువుకుంటున్నా. రాష్ట్ర భాష తమిళం కూడా అభ్యసిస్తున్నా. – ఫాజల్ బాషా,
చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా
Comments
Please login to add a commentAdd a comment