– క్షేత్రస్థాయి అధికారుల్లో అలసత్వం
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ర్యాంపు సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. 7 రోజులు మాత్రమే గడువు వుంది. ఈలోపు వంద శాతం పూర్తి చేస్తారా లేదా అన్నది అనుమానమే. ఎంఎస్‌ఎంఈల సర్వే ద్వారా ఉద్యమ్ గుర్తింపు సంఖ్య వచ్చిన తర్వాత నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. అన్ని విధాలా ఆదుకోడానికి ఈ సర్వే ఎంతో కీలకం. క్షేత్రస్థాయిలో అధికారుల్లో అలసత్వం కారణంగా ముందుకు సాగడం లేదు. ఈ సర్వే నవంబరు 29న మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ప్రక్రియ ముగియనుంది. జిల్లాలో మొత్తం 67,151 ఎంఎస్‌ఎంఈలు ఉన్నట్లు విద్యుత్ సర్వీసుల ఆధారంగా ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పటి దాకా 20,111 ఎంఎస్‌ఎంఈలను సర్వే చేయగా ఇంకా 47,040 పరిశ్రమల్లో సర్వే చేయాల్సి ఉంది. ముఖ్యంగా చిత్తూరు, పెనుమూరు, నగరి, యాదమరి, పలమనేరు, గుడిపాలలో 8 నుంచి 20 శాతం కూడా పూర్తి కానట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఉన్నవాటిలో సోమల, పుంగనూరు, శాంతిపురం, రొంపిచెర్ల ప్రాంతాల్లో 88 నుంచి 97 శాతం పూర్తయింది. పరిశ్రమల సంఖ్య తక్కువగా ఉన్న పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, బంగారుపాళ్యం, గంగవరం ప్రాంతాల్లో దాదాపు 30 శాతం సర్వే కూడా పూర్తి కాలేదు.
ఎంఎస్‌ఎంఈలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కీలకం
ప్రజలకు ఆధార్ ఎలాగో ఎంఎస్‌ఎంఈలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంతకీలకమైంది. ప్రతి పరిశ్రమకూ ఒక నంబరు ఉవ్వడంతోపాటు వివరాలు నమోదు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సర్వేలో వివరాలు నమోదు చేసి వారికి ఉద్యమ్ నంబర్ ఇస్తారు. భవిష్యత్‌లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నష్టాలు వస్తే పరిహారం ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య తెలియాలి. అందుకోసమే సర్వే చేయిస్తున్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యంతో సర్వే పడకేసినట్లు తెలుస్తోంది. వీటిపై కలెక్టర్, పరిశ్రమలశాఖాధికారులు నిత్యం సమీక్షిస్తున్నా ఆశించిన స్థాయిలో పని జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment