పోలీస్ స్టేషన్లో మహేశ్ తదితరులపై కాల్పులు జరుపుతున్న ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్
థానె/ముంబై: మహారాష్ట్రలోని ఓ పోలీస్‌స్టేషన్ బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఉదంతానికి కేంద్ర బిందువైంది. సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఛాంబర్‌లోనే శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పుల వర్షం కురిపించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న మహేశ్‌కు ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూమిని శివసేన నేత మహేశ్ కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తన కుమారుడితో మహేశ్ మనుషులు దారుణంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు.
శుక్రవారం అర్ధరాత్రి థానె జిల్లా ఉల్హాస్‌నగర్ హిల్‌లైన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ‘‘తమ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదుచేసేందుకు ఎమ్మెల్యే కుమారుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి మహేశ్ తన మనుషులతో వచ్చారు. గణ్‌పత్ రాకతో గొడవ పెద్దదై కాల్పులకు దారి తీసింది’’అని అదనపు పోలీస్ కమిషనర్ షిండే వెల్లడించారు. కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సలు బాధ లేదు: ఎమ్మెల్యే
కాల్పులు జరిపినందుకు అస్సలు బాధ పడటం లేదని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లోనే నా ముందే నా కొడుకును అన్యాయంగా చితకబాదుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఐదు రౌండ్లు కాల్చా. శివసేనను చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రలో నేర సామ్రాజ్యం సృష్టించారు’’ అని అరెస్ట్‌కు ముందు చెప్పారు. రాహుల్ పాటిల్ అనే వ్యక్తికీ బుల్లెట్లు తగిలాయి. కాల్పుల ఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తునకు ఆదేశించిన ఫడ్నవిస్
మొత్తం వివాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం చెప్పారు. ఆయనది తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని బీజేపీ పేర్కొంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. అధికార పార్టీల నేతల ఆగడాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని రుజువైందని కాంగ్రెస్ పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ కలిసి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment