చుట్టూ ఆందోళనతో తిరుగాడే జనం.. ఏం జరిగింది? అంతు చిక్కడం లేదు. అమ్మమ్మ కళ్లు చెమర్చి ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నారో ఏడేళ్ల బాలుడికి తెలియదు. ‘అమ్మమ్మ.. నిన్నటి నుంచి నాన్నను చూడలేదు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది...’ ఆ బాలుడి మాటలకు గుండెలకు హత్తుకున్న అమ్మమ్మ మౌన రోదనే సమాధానమైంది. కన్నతండ్రిని చూడాలన్న ఆరాటంతో తమను చుట్టు ముట్టిన జనాన్ని తప్పించుకున్న ఆ బాలుడు మెల్లగా మార్చురీలో కాలు పెట్టాడు.
డాక్టర్‌గా మెడలో స్టెత్ వేసుకుని హుందాగా తిరుగాడే నాన్న అక్కడ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. ‘నాన్న లే నాన్న’అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని కదిపాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబీకులు ‘నాన్న పడుకుని ఉన్నాడు.. లేచాక మాట్లాడుదువుగాని రా’ అంటూ నచ్చచెప్పి మార్చురీ బయట ఉన్న అమ్మమ్మ వద్దకు చేర్చారు. గురువారం అనంతపురం శివారులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ రాజేష్ కుమారుడు రోహన్ ఆవేదన ఇది.
సాక్షి,అనంతపురం క్రైం: నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీ శిల్పారామం ప్రవేశ మార్గంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ దేశాయి గురు రాజేష్ (39) అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు...బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పనిపై జేఎన్‌టీయూఏ వద్దకు వెళుతున్నట్లు భార్య డాక్టర్ లక్ష్మి (బి.పప్పూరు పీహెచ్‌సీ వైద్యాధికారి)కు తెలిపి ఇంటి నుంచి డాక్టర్ రాజేష్ బయటకు వచ్చారు. అర్ధరాత్రి 1 గంటైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేశారు.
ఫోన్ స్విచ్ఛాఫ్ అంటూ సమాధానం వచ్చింది. వేకువజామున 44వ జాతీయ రహదారిపై శిల్పారామం వద్ద టీ కొట్టు తెరిచేందుకు వచ్చిన వెంకటేష్ నాయక్.. ప్రమాదానికి గురైన కారును గమనించి, ఆ చుట్టుపక్కల గాలించాడు. పక్కనున్న సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద ఓ మృతదేహం పడి ఉండడంతో సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్, మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని డాక్టర్ రాజేష్‌గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ప్రమాదం జరిగిందిలా..
నగరంలోని రెండో రోడ్డులో నివాసముంటున్న డాక్టర్ రాజేష్.. అర్ధరాత్రి తన హుండాయ్ వెర్నా కారులో తపోవనం ఫ్లై ఓవర్ నుంచి హైదరాబాద్ వైపుగా వేగంగా వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. సీ స్క్వయర్ కాఫీ క్లబ్‌కు అమర్చిన సీసీ కెమెరాలో రాత్రి 11.37 గంటలకు నమోదైన ఫుటేజీలో డాక్టర్ రాజేష్ గాలిలో చక్కర్లు కొడుతూ ఎగిరి వచ్చి పడిన దృశ్యాలు కనిపించాయి. తొలుత శిల్పారామం నామఫలకాన్ని ఢీకొన్న కారు.. ఆ వేగానికి దాదాపు 15 అడుగుల ఎత్తు గాల్లోకి లేచింది. తెరుచుకున్న కారు డోరు నుంచి డాక్టర్ రాజేష్ బయట పడ్డారు. దాదాపు 181 అడుగుల దూరం గాలిలో చక్కర్లు కొడుతూ వెళ్లి సీ స్క్వయర్ కాఫీ క్లబ్ ప్రహరీ వద్ద పడ్డారు. పడిన వెంటనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
పలువురి దిగ్భ్రాంతి
నగర పాలక సంస్థ ఎంహెచ్‌ఓగా ఆయన పనిచేస్తున్న సమయంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ రాజేష్ అహరి్నశం శ్రమించారు. ప్రమాదంలో ఆయన మృతి చెందారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనైన మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి, వైఎస్సార్ సీపీ నేత అనంత చంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
చదవండి: వివాహితపై గ్యాంగ్ రేప్
Comments
Please login to add a commentAdd a comment