రౌస్ అవెన్యూ కోర్టు వద్ద కవిత
ఇందులో నా ప్రమేయం లేదు
ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదు
అయినా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించా
నాపై తీవ్ర చర్యలు వద్దని సుప్రీంకోర్టు చెప్పింది
ఆధారాల్లేకున్నా ఈడీ అరెస్టు చేసింది
ఈడీ, సీబీఐ కేసుల్లో 95% ప్రతిపక్షాలపైనే ఉన్నాయి..
నిందితులు బీజేపీలో చేరితే దర్యాప్తు ఆకస్మికంగా నిలిచిపోతోంది
పరీక్షల వేళ నేను దగ్గరలేకపోవడం కుమారుడిపై ప్రభావం చూపుతుంది
అందుకే బెయిలివ్వాలని మళ్లీ కోరుతున్నా..
కోర్టులో స్వయంగా ప్రస్తావించేందుకు రాసుకొచ్చిన 4 పేజీల లేఖలో కవిత
నిరాకరించడంతో మీడియాకు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా హక్కులకు భంగం కలగకుండా, ఈ కేసులో పేర్కొన్న విషయాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని చెప్పాలనుకుంటున్నా. రెండున్నరేళ్లుగా ఈడీ/సీబీఐ దర్యాప్తు ముగింపు లేని దర్యాప్తుగా సాగడం ప్రపంచమంతా చూస్తోంది. ఈ విషయంలో మహిళా రాజకీయ నాయకురాలిగా ఇతరులకన్నా ఎక్కువ బాధితురాలిని నేనే. ఈ కేసు నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసింది. నా వ్యక్తిగత ఫోన్ నంబర్ అన్ని టీవీల్లో ప్రసారం చేయడం నా గోప్యతకు భంగం కలిగిస్తోంది. నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాను.
వారి ముందు నాలుగుసార్లు హాజరయ్యాను. నాకు తెలిసినంత వరకూ వారికి సమాధానమిచ్చాను. నా బ్యాంకు, వ్యాపార వివరాలు తెలియజేశాను. నా ఫోన్లు దర్యాప్తు సంస్థకు ఇచ్చి పూర్తిగా సహకరించినా వాటిని ధ్వంసం చేశానని నిందిస్తున్నారు. రెండున్నరేళ్లలో దర్యాప్తు సంస్థలు అనేక మంది విషయంలో పలుసార్లు దాడులకు పాల్పడటంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించి, బెదిరించి అరెస్టు చేశాయి. అయినప్పటికీ తమ ప్రకటనలను, రాజకీయ పొత్తులను మారుస్తూ వచ్చిన వారి నుంచి కొన్ని స్టేట్‌మెంట్లు సేకరించాయి. ఈ కేసు మొత్తం వాంగ్మూలాల మీదే ఆధారపడి ఉంది.
కేసులో డబ్బు లావాదేవీలు ఎక్కడా లేవని... అవినీతికి సంబంధించిన ఆధారాలు లేవనడాన్ని తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సాక్షుల్ని తారుమారు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్నెందుకు అరెస్టు చేయలేదు. రెండున్నరేళ్ల దర్యాప్తు విఫలమైన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం స్టేట్‌మెంట్ల ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. నాపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అరెస్టు చేసింది.
ప్రస్తుతం ఈడీ/సీబీఐ కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే ఉన్నాయి. నిందితులు బీజేపీలో చేరితే దర్యాప్తు ఆకస్మికంగా నిలిచిపోతోంది. నోరుమెదపకండి లేకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నాయకులు పార్లమెంటు వేదికగానే బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పారీ్టలు ఏదైనా ఉపశమనం లభిస్తుందని న్యాయస్థానాలు వైపు చూస్తున్నాయి. నేను ఈడీ ప్రక్రియ విధానాలకు సహకరించడం తప్ప ఏమీ చేయలేను. ఆ విధంగానే కొనసాగుతున్నాను. అందుకే నాకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నా. నా జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే బాధ్యాతయుతమైన తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను.
నేను చాలా అర్హతలు కలిగిన వ్యక్తిని. అందుకే కుమారుడు బోర్డు పరీక్షలు, ఆప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు నా పాత్ర ఏమిటో అర్థం చేసుకున్నాను. నేను ప్రపంచానికి దూరంగా ఉండే వ్యక్తిని కాదు. నేనేమీ ఒకే సంతానం కలిగిన తల్లిని కాదు. తల్లి స్ధానాన్ని భర్తీ చేయగలమా? చదువు విషయంలో నా కుమారుడుకి ఇది చాలా క్లిష్టమైన సంవత్సరం. నేను గైర్హాజరు కావడం కుమారుడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నా. అందుకే నా బెయిల్ అభ్యర్థన పరిశీలించాలని మళ్లీ కోరుతున్నా’ అని కోర్టులో స్వయంగా ప్రస్తావించేందుకు రాసుకొచ్చిన 4 పేజీల లేఖలో కవిత పేర్కొన్నారు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకోనందున కోర్టు అనుతించకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం పాలసీ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందన్న అభియోగాలకు సంబంధించిన కేసులో ఈడీ అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఆమెను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆదేశించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం కవితను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ సమయంలో కవితను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. చార్జిషిటులో కవిత పాత్రపై స్పష్టత ఇవ్వడానికి మరో 14 రోజుల గడువు కావాలని కోరారు. అయితే కస్టడీ పొడిగింపు ద్వారా ఈడీ తెలుసుకోవాల్సిన విషయాలేవీ లేవని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదించారు. ఈ కేసులో రెండేళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్నా ఈడీ అధారాలేవీ చూపలేదన్నారు. కవితకు స్వయంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
నిందితులకు నేరుగా మాట్లాడే హక్కు ఉందని కవిత న్యాయవాది తెలపగా అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. వాదనల అనంతరం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో కవితను ఆమె భర్త, మామ కలిసి కాసేపు మాట్లాడారు. అంతకుముందు కవిత స్వయంగా వాదించుకొనే అవకాశం వస్తుందని భావించి న్యాయమూర్తి ముందు ఏయే అంశాలు ప్రస్తావించాలో నాలుగు పేజీల్లో రాసుకొని కోర్టుకు వచ్చారు. అయితే న్యాయమూర్తి నిరాకరించడంతో వాటిని మీడియాకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment