సాక్షి, కాకినాడ రూరల్: చిన్న తప్పు చివరికి ఎంత పెద్ద దొంగనైనా పట్టిస్తోంది.. ఓ వ్యక్తి హత్య కేసులో సైకిల్ తాళం, సాంకేతికత కీలకమైంది.. నిందితులను కటకటాల పాల్జేసింది.. సంచలనం రేపిన కరప మండలం నడకుదురులో వ్యక్తి హత్య కేసును వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. హతుడు రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పేపకాయల సతీష్‌కుమార్ (35)గా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా అతడి వేధింపులు తాళలేని ఓ మహిళ తన సోదరి సహకారంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు వివరాలను సోమవారం సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ సర్కిల్ స్టేషన్‌లో డీఎస్పీ భీమారావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 16న కరప మండలం నడకుదురు శివారులో ఓ ఖాళీ స్థలంలో తుమ్మ చెట్ల పొదల కింద కాలిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత కిరాతకంగా అతన్ని కాల్చి చంపేశారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ ఇన్‌చార్జి సీఐ పర్యవేక్షణలో ఎస్సైలు రామారావు, నాగార్జున విచారణ చేపట్టారు. కాలిపోయిన మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరచగా 19న ఉదయం బంధువులు పరిశీలించి సతీష్ మృతదేహంగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
మైక్ సెట్‌లు అద్దెకు ఇస్తూ.. రైస్ మిల్లులో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసే సతీష్‌కుమార్‌కు సుమారు 16 ఏళ్ల కిందట వెల్ల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సునీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల కిందట సతీష్‌కుమార్‌కు దీర్ఘకాలిక వ్యాధి రావడంతో కాకినాడ జీజీహెచ్‌లో వైద్యం పొందేవాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి తరచూ గొడవ పడేవారు. ఈ పరిణామాలతో అక్కడి రజకవీధికి చెందిన తోట అర్జవేణితో వివాహేతర సంబం«ధం పెట్టుకున్నాడు. సతీష్‌కుమార్‌కు ఉన్న వ్యాధి గురించి ఆమెకూ తెలియడంతో తన వద్దకు రావొద్దని చెప్పింది. మనస్తాపం చెందిన అతను మార్చి 3న పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడు. అర్జవేణికి తరచూ ఫోన్ చేసి భర్త, పిల్లలను విడిచి తనతో వచ్చేయాలని వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె తన అక్క నడకుదురుకు చెందిన ఐరెడ్డి రాజేశ్వరి సహాయం కోరింది.
దీంతో వారిద్దరూ సతీష్‌కుమార్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ నెల 15న ఉదయం అతన్ని నడకుదురు రప్పించారు. వారి పథకం ప్రకారం ముందుగా ఆ గ్రామంలోని పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్‌ను ఖాళీ డ్రింక్ బాటిల్‌లో వేరే వ్యక్తి సహాయంతో రప్పించుకుని సతీష్‌కుమార్‌ను నేర స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ అర్జవేణి తన మోకాలితో సతీష్‌కుమార్ మర్మాంగాలపై పలు పర్యాయాలు తన్నడంతో విలవిల్లాడుతూ కింద పడిపోయాడు. అతడి గుండెలపై కూర్చొని మెడకు చున్నీ బిగించి అక్క రాజేశ్వరి సహాయంతో చంపేశారు. ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించి ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు పాటించారు. అనంతరం హైదరాబాద్‌కు పరారయ్యారు.
చాలెంజ్‌గా తీసుకుని..
ఈ కేసును అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ భీమారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు మొగలి వెంకటేశ్వరరావు, అంబికా ప్రసాద్ సూచనలు, సలహాలు, రూరల్ సీఐ మురళీకృష్ణ సహాయంతో పిఠాపురం సీఐ రామచంద్రరావు, ఎస్సైలు రామారావు, నాగార్జున ఛేదించారు. నిందితులు తోట అర్జవేణి, ఐరెడ్డి రాజేశ్వరిలను నడకుదురులో ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ భీమారావు తెలిపారు. నిందితుల నుంచి మృతుడికి చెందిన రెండు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నామన్నారు. నేర స్థలం వద్ద లభించిన సైకిల్ తాళం వెల్ల గ్రామంలో హతుడి ఇంటి వద్ద ఉన్న సైకిల్‌కి సరిపోవడంతో ఇది దర్యాప్తులో కీలకమైందన్నారు. అలాగే అక్కచెల్లెళ్ల కాల్ రికార్డింగ్‌లు, వారు హత్యా స్థలం వద్దకు వెళ్లేటప్పుడు పెట్రోల్ ఉన్న సంచి, తిరిగి వచ్చేటప్పుడు సీసీ కెమెరాలోని చిత్రాలు, ఇతర సాంకేతిక అంశాలు నిందితులను పట్టుకోవడంలో సహాయ పడ్డాయన్నారు. కేసును ఛేదించిన పిఠాపురం సీఐ, రూరల్ క్రైమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడిస్తున్న కాకినాడ డీఎస్పీ భీమారావు, చిత్రంలో సీఐలు, ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment