రైలు ఢీకొని తండ్రి..ఇద్దరు కూతుళ్లు మృతి
ముగ్గురి మృతికి సాక్షిగా మిగిలిన కన్నతల్లి
గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో ఘటన
మేడ్చల్: మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తోగరి కృష్ణ (42) తన భార్య కవిత (37), కుమార్తెలు వర్షిత (12), వరిణి (8)లతో కలిసి అత్వెల్లి పరిధిలోని రాఘ వేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజులుగా మేడ్చల్ –మనోహరాబాద్ రూట్లో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
కాగా, ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండటంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెళ్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటల సమయంలో చేరుకున్నారు. భార్య, పిల్లలను స్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్లాట్ ఫాంపై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్ చివరిలో ట్రాక్‌పైకి పనిచేసేందుకు వెళ్లాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు వరిణి ట్రాక్‌పై దిగి తండ్రి వైపు వస్తోంది.
ఈ క్రమంలోనే పెద్ద కూతురు, కవితకూడా ట్రాక్‌పై దిగి కృష్ణ పనిచేస్తున్నవైపు నడుస్తున్నారు. 3.45 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్‌కు చేరింది. అక్కడ స్టాప్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండటం, కూతుళ్లు ట్రాక్‌పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతు రును పట్టుకుని ట్రాక్‌కు ప్లాట్ ఫాంకు మధ్యలో గోడవైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురును రైలు ఢీకొట్టింది.
కవిత మరో ట్రాక్‌పైకి వెళ్లింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లను కూడా రైలు వేగంగా ఢీకొనడంతో ముగ్గురూ మృతి చెందారు. ట్రాక్‌పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్టేషన్‌లో ఉన్న వారు కవిత చిరునామా తెలుసుకుని బంధువు లకు, అపార్ట్‌మెంట్ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment