కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఒత్తిళ్లు, హోం సిక్ తదితర కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. అదే సమయంలో విద్యాలయాల్లో ‘ర్యాగింగ్ విష పురుగులు’ రెచ్చిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ర్యాగింగ్ రోగం ఓ అమాయకుడి జీవితాన్ని చిదిమేసింది. సీనియర్లంతా కలిసి గే అని ప్రచారం చేయడంతో.. ఆ మరకను తట్టుకోలేకపోయాడతను. భరించలేక హాస్టల్ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణం విడిచాడు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేపిన ర్యాంగింగ్ మరణంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు..
Jadavpur University ragging: కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్‌లో చేరిన స్వప్నదీప్ కుండూ(18).. బుధవారం అర్ధరాత్రి హాస్టల్ బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద సౌండ్ రావడంతో విద్యార్థులు బయటికి వచ్చి చూడగా.. నగ్నంగా రక్తపు మడుగులో పడి కనిపించాడు. దీంతో కేపీసీ మెడికల్ కాలేజీకి తరలించగా.. గురువారం వేకువ ఝామున కన్నుమూశాడు. అదే రోజు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
నేను గే కాదు..
బిల్డింగ్ మీద నుంచి దూకే ముందు స్వప్నదీప్ ‘నేను గే కాదు.. నేను గే కాదు’’ అంటూ అరుస్తూ దూకినట్లు కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో స్వప్నదీప్‌ను హాస్టల్‌లో ఉన్న సీనియర్లు కొందరు ర్యాగింగ్ చేశారని.. ఫలితంగానే స్వప్నదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాని పోలీసులు తేల్చారు. స్వప్నదీప్‌ను గేగా సీనియర్లు ప్రచారం చేశారని, తోటి విద్యార్థుల ముందు అవమానించారని.. ఘటన జరిగిన రాత్రి అతని దుస్తులిప్పించి మరో విద్యార్థి గదికి వెళ్లాలంటూ బలవంతం చేశారని ర్యాగింగ్ బాధితులు మరికొందరు పోలీసులకు చెప్పారు.
కోర్సు ముగిసినా..
దేశంలోని చాలా యూనివర్సిటీల్లో ఉండే సమస్య జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనూ ఉంది. తమ తమ కోర్సులు ముగిసినా.. కొందరు మాజీలు హాస్టల్‌లోనే కొనసాగడం!. ఎమ్మెస్సీ పూర్తి చేసిన సౌరభ్ చౌదరి ఇదే కోవకి చెందిన వ్యక్తి. బయట ఉద్యోగం చేస్తూ క్యాంపస్ హాస్టల్‌లో ఉండడమే కాకుండా.. జూనియర్ల మీద ర్యాగింగ్ పేరుతో ప్రతాపం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వప్నదీప్‌ను ర్యాగింగ్ చేయడంతో.. అతను అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సౌరభ్ సైతం తాను నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు కూడా. దీంతో ఐపీసీ సెక్షన్ 302/34 కింద కేసు నేరాభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. శనివారం(ఇవాళ) సౌరభ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు.
పుత్రశోకంలో..
నదియా బోగుల ఏరియాకు చెందిన స్వప్నదీప్ జాదవ్ అలియాస్ గోపాల్. స్వప్నదీప్ స్కూల్‌లో బ్రైట్ స్కూడెంట్. పాఠాన్ని ఒక్కసారి వింటే పట్టేస్తాడు. లక్షల్లో ఒక్కడు అనే ట్యాగ్ లైన్ ఉంది అతనికి. అంత బాగా చదివే విద్యార్థి ఇలా అర్థాంతంరంగా.. అదీ ర్యాంగింగ్ వల్ల చనిపోవడాన్ని తోటి విద్యార్థులు, అతనికి పాఠాలు నేర్పిన గురువులు తట్టుకోలేకపోతున్నాయి. పైగా యూనివర్సిటీలో స్వప్నదీప్ చేరి వారం కూడా కాలేదు. ఆగష్టు 6వ తేదీన తండ్రి హాస్టల్‌లో దిగబెట్టి వచ్చాడు. ఈ వారంరోజుల్లో.. క్లాసులు జరిగిన మూడు రోజులూ హాజరయ్యాడు. ఈలోపే ఆ తల్లిండ్రుల కలలు చెల్లాచెదురు అయ్యాయి. కొడుకు జీవితంలో ఎదిగి తమకు ఆసరాగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. తల్లి స్వప్న కొడుకు చిన్ననాటి ఫొటోలు పట్టుకుని గుండెలు బద్ధలయ్యేలా ఏడుస్తోంది. కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడనే నిజాన్ని.. కన్నీళ్లను దిగమింగుకుని స్వప్నదీప్ తండ్రి రాంప్రసాద్.. భార్యను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు.
అగ్నిగుండంగా జేయూ..
ప్రెషర్ స్టూడెంట్ స్వప్నదీప్ ఆత్మహత్య ఘటన ఉదంతంతో జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఉలిక్కి పడింది. సీనియర్‌ల ఘాతుకాలను బయటపెడుతూ మరికొందరు ముందుకు వచ్చారు. విద్యార్థి సంఘాలు ఘటనను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టాయి. ఓ విద్యార్థి బంగారు భవిష్యత్తును చిదిమేసిన ర్యాంగింగ్ భూతాన్ని అణచివేయాలని.. ఘటనకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి ప్రొఫెసర్లు సైతం మద్దతు ప్రకటించడం గమనార్హం. మరోవైపు ర్యాంగిగ్ ఫ్రీ క్యాంపస్‌గా జాదవ్‌పూర్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
అక్కడ. ఇక.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సైతం క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులతో చర్చలు జరిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారాయన. అంతేకాదు స్వప్నదీప్ కుటుంబాన్ని ఫోన్‌లో సైతం పరామర్శించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment