
ఓ పెడ్లర్ వద్ద లభించిన వివిధ రకాల మత్తు పదార్థాలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: సిలికాన్ సిటీలో మత్తు పదార్థాల రవాణా– విక్రయాలు ఆందోళనకరస్థాయికి చేరాయి. గత ఆరునెలల్లో బెంగళూరులో 100 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్‌చేశారు. వారినుంచి సుమారు 2,500 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఆరునెలల్లో 2,550 కేసులు నమోదు కాగా 3,771 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాది ఆరునెలలకే గతేడాది కంటే ఎక్కువమంది దొరికిపోయారు. వీరిలో వంద మంది విదేశీయులు ఉండడం గమనార్హం.
వారిదే అధిక వాటా
నైజీరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన పర్యాటకులు హెణ్ణూరు, బాణసవాడి, కోరమంగల, కొత్తనూరు, రామమూర్తినగర, యలహంక, పుట్టేనహళ్లి, వైట్‌పీల్డ్, మారతహళ్లి, బెళ్లందూరు ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. చదువు, పర్యాటకం ముసుగులో డ్రగ్స్ విక్రయాలే వృత్తిగా చేసుకున్నారు.
బెంగళూరులో జరిగే డ్రగ్స్ దందాలో 60 శాతం వాటా వీరిదే. దేశ విదేశాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ సేకరించి టెక్కీలు, సంపన్నులు, విద్యార్థులకు అమ్ముతూ నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎల్‌ఎస్‌డీ, హషిష్, కొకైన్, బ్రౌన్‌షుగర్, గంజాయి సహా వీరి వద్ద దొరకని డ్రగ్ ఉండదని చెబుతారు. ఆర్డర్ ఇస్తే గంటల్లో ఇంటికే డెలివరీ చేస్తారు. విదేశీయుల డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేస్తున్నామని పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు.
ఏడాది కేసులు విదేశీయులు దొరికిన డ్రగ్స్ (కేజీలు)
2018 285 44 764
2019 768 38 1,053
2020 2,766 84 3,912
2021 2,550 100 2,545