సాక్షి, చెన్నై: భర్త చేసిన అప్పులు భార్యను మనోవేదనకు గురిచేసింది. అప్పులు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచుతుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకుంటే పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో వారిని హతమార్చి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన శీర్గాలిలో మంగళవారం వెలుగు చూసింది. మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని మూలనాయనూరుకు చెందిన కార్తిక్ (27) మూడేళ్ల క్రితం భారతి(21)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు కౌశిక్(3), కుమార్తె భవధరణి(1) ఉన్నారు.
కంటైనర్ డ్రైవర్ అయిన కార్తిక్ తరచూ పుణె, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లేవాడు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అప్పులు క్రమంగా పెరగడంతో తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్లు తరచూ ఇంటి రావడంతో భారతి మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లి చిత్రకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి కట్ చేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పిల్లలు, భారతి ఉరికి వేలాడుతూ కనిపించడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మంగళవారం వేకువజామున సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శీర్గాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుజరాత్‌కు వెళ్లిన కార్తిక్‌కు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment