సాక్షి, ఉప్పల్: ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్(60) కరోనా బారినపడి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఈ నెల 14న ఆస్పత్రిలో చేరారు. గౌస్ స్వగ్రామం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు. ఈయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్‌లో నివాసం ఉంటున్నారు.
దేశంలో వామపక్షాల ఐక్యత, సామాజిక న్యాయం సాధనపై మహ్మద్ గౌస్ తన వంతు కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన ప్రజలు అధికారం సాధించాలని కోరుకున్న ఆయన నిరంతరం అందుకు కృషి చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక మేధావులు సామాజికవేత్తలతో చర్చలు జరిపారు. మంగళవారం గౌస్ స్వగ్రామం కొత్తూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎంసీపీఐ(యూ)నేత వనం సుధాకర్ తెలిపారు.
చాడ, తమ్మినేని సంతాపం
మహ్మద్ గౌస్ మృతిపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. వామపక్ష ఉద్యమ బలోపేతానికి గౌస్ నిరంతరం కృషి చేశారని, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని నివాళులర్పించారు. గౌస్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.
చదవండి: రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే
Comments
Please login to add a commentAdd a comment