గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ వాహనంపై ఆదివారం ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ డిటోనేటర్‌తో దాడిచేశాడు. అది పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు.
అదే సమయంలో సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన హరిజన గణేశ్ తన జేబులో ఉన్న ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకుని ఎమ్మెల్యే వాహనంపై విసిరాడు. అది పేలలేదు. గమనించిన సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది వెంటనే గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితుడు గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసన్ కంపెనీలో డ్రైవర్ విధులతోపాటు డిటోనేటర్లు పేల్చేపని చేసేవాడు.
ఆదివారం అతిగా మద్యం తాగడంతో కాంట్రాక్టర్ పనుల్లో పెట్టుకోకుండా వెళ్లిపొమ్మన్నాడు. దీంతో అతడు నేరుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాడు. మద్యం మత్తులో ఎమ్మెల్యే వాహనంపైకి డిటోనేటర్ విసిరాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ డీఎస్పీ ఉసేన్‌పీరా గోరంట్ల స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరింత లోతుగా విచారించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని ఎస్పీ తెలిపారు.
ఘటన దురదృష్టకరం
నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ ప్రభావం లేకుండా ప్రజలకు సేవచేస్తున్నా. డిటోనేటర్ పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దురదృష్టకరం. పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ఎమ్మెల్యే శంకరనారాయణ
Comments
Please login to add a commentAdd a comment