సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి).. పలువురు సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. కేపీ చౌదరి దందా, డ్రగ్స్ కొన్నవారి జాబితా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోగా.. వాటిని పోలీసులు వెలికితీసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈనెల 14న కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించానని పోలీసులకు చెప్పారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అవన్నీ అవాస్తవాలు: అషురెడ్డి
కేపీ చౌదరి వ్యవహారంపై అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘‘కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు అవాస్తవం. నాపై అలా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా ఫోన్ నంబర్‌ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదు’’అని పేర్కొన్నారు.
ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా.. కొద్దిరోజులు అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడిగాడని, అంతేతప్ప ఆ ఇంట్లో వారేం చేశారనేది తనకు తెలియదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment