ప్రభుత్వ వైఫల్యంతో తొక్కిసలాట : మాజీ ఎంపీ
అల్లవరం: తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శన టిక్కెట్లు జారీ చేసే సందర్భంలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందడం, ఎక్కువ సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని మాజీ ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. ఆమె గురువారం ప్రకటనలో ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని, ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యత వహించాలన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందన్నారు. తిరుపతి చరిత్రలో ఈ సంఘటన మాయని మచ్చగా ఉంటుందన్నారు.
ముగిసిన క్రీడా పోటీలు
రాయవరం: కోనసీమ జిల్లావ్యాప్తంగా ‘కోనసీమ క్రీడోత్సవం..ఆటలతో ఆనందం’ పేరుతో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన క్రీడా పోటీలు గురువారంతో ముగిశాయి. జిల్లాలోని 22 మండలాల్లో ఎంపిక చేసిన క్రీడా ప్రాంగణాల్లో ఈ పోటీలు నిర్వహించారు. డీఈవో డాక్టర్ షేక్ సలీం బాషా ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులు ఈ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. 4, 5, 6 తరగతులను ప్రైమరీ, 7, 8, 9 తరగతులను హైస్కూల్ విభాగాలుగా విభజించి, బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,276 ప్రాథమిక, 69 ప్రాథమికోన్నత, 237 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలతో పాటుగా, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ తదితర స్కూల్ గేమ్స్ పోటీలను నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మండల స్థాయి వరకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. హైస్కూల్ స్థాయి పోటీలలో మండల స్థాయి విజేతలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తపేట: ట్రాక్టర్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై జీ సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పలివెల గ్రామానికి చెందిన పిండ్రాళ్ల చిన్నయ్య కొబ్బరి కాయలతో నడుచుకుంటూ, కొత్తపాలెంకు చెందిన కొప్పిశెట్టి వెంకటరమణ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పలివెల వంతెన సమీపంలో ట్రాక్టర్ అతి వేగంతో వచ్చి ఇద్దరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నయ్య (31) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణకు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స జరిపి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుని తండ్రి పిండ్రాళ్ల పెద్ద పెద్దింట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment