ముక్కోటికి కోవెలల ముస్తాబు
కొత్తపేట: ముక్కోటి ఏకాదశికి వైష్ణవాలయాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పర్వదినం సందర్భంగా శుక్రవారం ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు. ధనుర్మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారు. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకు మండల పరిధిలోని ప్రసిద్ధ ఆలయాలను ముస్తాబు చేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తర లివస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ –ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని, ఆలయాన్ని, ధ్వజస్తంభాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వెంకటేశ్వరస్వామి వారి ముఖ చిత్ర కటౌట్లతో ఏడు ద్వారాలు ఏర్పాటు చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి. ర్యాలి శ్రీజగన్మోహినీ కేశవస్వామి, ఆత్రేయపురం వేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు కొత్తపేట హరిహర దేవాలయ ప్రాంగణంలో శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి, వైకుంఠ ముక్కోటి రామాలయం (పాత రామాలయం), మందపల్లి పెద్ద వంతెన వద్ద వేంచేసియన్న శ్రీవేంకటేశ్వరస్వామి, వానపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు చేశారు. ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు, ప్రత్యేక పూజల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు
మామిడికుదురు: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి కోవెలలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం అయిదు గంటల నుంచి ఉత్తర ద్వారం వద్ద ఉభయ దేవేరులతో బాల బాలాజీ స్వామి భక్తులకు సర్వ దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు గురువారం తెలిపారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా భారీ క్యూ లు ఏర్పాటు చేశామన్నారు. సర్వ దర్శనం పూర్తిగా ఉచితమని చెప్పారు. ముక్కోటి సందర్భంగా స్వామివారి మూల విరాట్‌కు లక్ష చామంతి పూలతో అర్చన ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
కోనసీమ తిరుపతిలో సర్వం సిద్ధం
పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment