గల్ఫ్‌లో బాధితురాలి ఆర్తనాదం
ఇండియాకు తీసుకురావాలని వేడుకోలు
పి.గన్నవరం: జీవనోపాధి నిమిత్తం బెహ్రయిన్ దేశానికి వెళ్లి అక్కడ చిక్కుకున్న ఓ మహిళ తనను స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. బెహ్రయిన్‌లో ఆమె పని చేస్తున్న ఇంటి యజమానులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నానని, ఇండియాకు తిరిగి తీసుకురావడానికి ఏజెంట్లు రూ.లక్ష అడుగుతున్నారని రోదిస్తూ ఆమె నాలుగు రోజుల క్రితం వాట్సాప్‌లో పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. వివరాలివీ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన గుబ్బల వీర రాఘవులు భార్య కుమారి జీవనోపాధి నిమిత్తం గతంలో కువైట్ దేశానికి వెళ్లి, 20 ఏళ్ల పాటు పని చేసింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల కిందట కుమార్తె మరణించడంతో కుమారి స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. నాలుగు నెలల క్రితం జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన ఏజెంట్ వెంకటకృష్ణ, కాకినాడకు చెందిన కాశీ, లక్ష్మిల ద్వారా బెహ్రయిన్ వెళ్లేందుకు ఆమె సిద్ధమైంది. డబ్బులు చెల్లించనవసరం లేకుండా బెహ్రయిన్‌కు పంపిస్తామని, నెలకు రూ.30 వేల జీతం ఇస్తారని చెప్పిన ఏజెంట్లు.. తీరా ఎయిర్‌పోర్టుకు వెళ్లేసరికి రూ.లక్ష డిమాండ్ చేశారని ఆమె భర్త రాఘవులు గురువారం విలేకరులకు వివరించాడు. దీంతో గత్యంతరం లేక అప్పటికప్పుడు అప్పు చేసి రూ.లక్ష చెల్లించామన్నాడు. బెహ్రయిన్‌లో నాలుగు నెలలు పని చేసినా తనకు జీతం ఇవ్వలేదని, ఇంటి యజమానులు నానా ఇబ్బందులూ పెడుతున్నారని, తిండి కూడా సరిగా పెట్టడం లేదని, నలుగురు వ్యక్తులు చేయాల్సిన పనిని తనతో చేయిస్తున్నారని రోదిస్తూ కుమారి చేసిన వాట్సాప్ వీడియో కాల్‌ను ఆమె భర్త రాఘవులు రికార్డు చేశాడు. వాట్సాప్‌లో పెట్టడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని, ఫిట్స్ కూడా వస్తున్నాయని భర్త వివరించాడు. ఆమెను ఇండియాకు తిరిగి తీసుకువచ్చేందుకు ఏజెంట్లు రూ.లక్ష ఇవ్వాలని అడుగుతున్నారని చెప్పాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న తనకు అంత స్తోమత లేదని వివరించాడు. తన భార్యను క్షేమంగా ఇంటికి తీసుకు రావాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతూ రాఘవులు గత సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment