ఆనంద బరితం!
జూదాలు జరకుండా చూడండి
కోడిపందేలు, ఇతర జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ హెచ్చరించారు. తన చాంబర్‌లో ఆయన గురువారం రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని.. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడిపందేలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పందేలు జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కడా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించరాదన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే ఆయా ప్రైవేటు స్థలాలను జప్తు చేసే విధంగా రెవెన్యూ చట్టాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ గతంలో కోడిపందేలు నిర్వహిస్తూ పట్టుబడిన సుమారు 785 మందిని బైండోవర్ చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవోలు కె.మాధవి, శ్రీకర్, డి.అఖిల పాల్గొన్నారు.
సాక్షి, అమలాపురం: జూద బరులు.. కూటమి నేతలకు సిరులు కురిపించనున్నాయి. ఒకవైపు కోడిపందేలు.. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తెప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంటే మరోవైపు అధికార కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో పందేల బరులు సిద్ధమవుతున్నాయి. గత టీడీపీ పాలన కన్నా బరి తెగించి మరీ కూటమి ప్రభుత్వంలో పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో పట్టణం, పల్లె అనే తేడా లేదు. ప్రతిచోటా పందేల బరులు సిద్ధమవుతున్నాయి. గుండాటలు, పేకాటల నిర్వహణ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. నియోజకవర్గ కీలక నేతలు, వారి కార్యకలాపాలు చక్కబెట్టేవారితో మాట్లాడుకోవడం, బరులు సిద్ధం చేయడం శరవేగంగా సాగిపోతున్నాయి. ఒక్కొక్క బరికి రూ.ఐదు లక్షల నుంచి రూ.25 లక్షల వరకు చెల్లించేలా మాట్లాడుకుంటున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంతంగా బరులను సిద్ధం చేసుకుంటున్నారు. వారి సొంత బరులకు ఇబ్బంది లేకుండా వాటికి సమీపంలో బరులు వేయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే పండగ సందడి పేరుతో పెద్ద ఎత్తున జూదాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పండగ నిర్వహణ పేరుతో ఒక వైపు ప్రభుత్వం నుంచి సొమ్ము రాబట్టడం.. మరోవైపు జూదాలకు అనుమతులు ఇస్తూ రెండు చేతులా సంపాదనకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
● అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో భారీగా కోడి పందేలు, గుండాటల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. బీచ్‌తోపాటు ఇదే గ్రామంలో శ్రీరామనగర్‌లో సహితం పోటీలు నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రూ.30 లక్షల వరకు బేరం పెట్టినట్టు తెలిసింది. చల్లపల్లి, చినగాడవిలి, ఎన్.కొత్తపల్లి, భీమనపల్లి, గొల్లవిల్లిలో ఏర్పాటు చేసే బరులకు సైతం పాటలు పెడుతున్నారు. అల్లవరం మండలంలో గోడి, గోడిలంక, అల్లవరం, అమలాపురం మండలం పేరూరు వై.జంక్షన్, కామనగరువులలో పందేల నిర్వహణకు ఇప్పటికే బరులు సిద్ధం చేస్తున్నారు.
● రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం పట్టణం కాకినాడ బైపాస్ రోడ్డు, రూరల్ మండలం తాళ్లపొలం, వెలంపాలెం, కె.గంగవరం మండలంలో కూళ్ల, మసకపల్లి, కాజులూరు మండల పరిధిలో గొల్లపాలెం, కాజులూరులో పెద్ద బరులు కాగా, ఇంకా చిన్నచిన్న బరులు లెక్కకుమిక్కిలి ఉన్నాయి. ఇక్కడ పెద్దాయనకు బరికి రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలు ఇవ్వాలని గతంలో వాయిస్ రికార్డరు సామాజిక మాధ్యమాల హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.
● ముమ్మిడివరం నియోజకవర్గంలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఈ ఏడాది భారీగా పందేలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా పది ఎకరాల స్థలంలో సినిమా సెట్టింగ్‌లతో బరులు ఏర్పాటు చేస్తున్నారు. పండగ మూడు రోజులూ రూ.వంద కోట్లు దాటి పందేలు జరిగే అవకాశముందని అంచనా. ముమ్మిడివరం మండలం రాజుపాలెం, కాట్రేనికోన మండలం చెయ్యేరులో పెద్ద పందేలు జరగనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో చిన్నచిన్న పందేలు జరగనున్నాయి.
● మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరపురం గోదావరి గట్టు, రాయవరం మండలం కూర్మాపురం, మండపేట మండలం ద్వారపూడి, కేశవరాల్లో పెద్ద పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
● పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో మామిడికుదురు మండలం గోగున్నమఠం, మగటపల్లి, పి.గన్నవరం మండలంలో పోతవరం, పి.గన్నవరం, అయినవిల్లి మండలంలో విలస, చింతనలంక, తొత్తరమూడి, అంబాజీపేట మండలంలో ముక్కామలలో భారీగా పందేలు నిర్వహించనున్నారు.
● కొత్తపేట నియోజకవర్గం పరిధిలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురంలో పెద్ద ఎత్తున పందేలు జరగనున్నాయి. కొత్తపేటలో భారీ బరిని సిద్ధం చేస్తున్నారు.
● రాజోలు నియోజకవర్గం పరిధిలో మలికిపురం మండలం లక్కవరంలో పందేలు అధికంగా జరగనున్నాయి. ఇక్కడ పందేల నిర్వహణకు అనుకూలంగా బరులు సిద్ధం చేసుకుంటున్నారు.
కూటమి నేతలకు సిరులు
కురిపిస్తున్న జూదాల బరులు
జిల్లాలో పలుచోట్ల
ఘనంగా సిద్ధమవుతున్న వైనం
రూ.రూ.ఐదు లక్షల నుంచి
రూ.25 లక్షల వరకు రేటు
Comments
Please login to add a commentAdd a comment