గ్రామ స్వరాజ్యానికి సమాధి | - | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్యానికి సమాధి

Published Mon, Feb 3 2025 12:14 AM | Last Updated on Mon, Feb 3 2025 12:14 AM

గ్రామ

గ్రామ స్వరాజ్యానికి సమాధి

అభివృద్ధి పునాదులపై కూటమి కాటు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

ఆర్‌బీకేలు, సచివాలయాలు,

హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం

గ్రామాల్లోనే సామాన్యులు,

రైతులు, రోగులకు విస్తృత సేవలు

వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధ్యయనం

విదేశీ ప్రముఖుల ప్రశంసలు

789 భవనాల నిర్మాణాలకు శ్రీకారం

రూ.229.89 కోట్ల

అంచనాలతో భవన నిర్మాణాలు

గత ప్రభుత్వంలో 508

భవనాల నిర్మాణాలు పూర్తి

కూటమి ప్రభుత్వం వచ్చాక

నిలిచిపోయిన పనులు

సాక్షి, అమలాపురం: సచివాలయాలు.. రైతు భరోసా కేంద్రాలు.. హెల్త్‌ సెంటర్లు.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల ద్వారా పట్టణ, గ్రామ ప్రజలకు, రైతులకు, రోగులకు అందించిన గణనీయమైన సేవలు తెలియనివి కాదు. గ్రామాలు, పట్టణాల్లో వారు నివసిస్తున్న వార్డుల్లోనే ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా పొందుతున్నారు. వీటితో పాటు ఆర్‌ బీకే, హెల్త్‌ సెంటర్ల ద్వారా కూడా మేలైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఇటువంటి వ్యవస్థలను కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే వలంటీర్‌ వ్యవస్థను దాదాపు ఎత్తేసిన ప్రభుత్వం.. సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులను దాదాపుగా నిలిపివేసి.. వీటన్నింటినీ పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

జిల్లాలో 789 గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్ల నిర్మాణాలకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు చేపట్టింది. ఇందుకు గాను రూ.229.89 కోట్ల పనులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో సుమారు రూ.156.06 కోట్లతో 508 భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది. ఇంచుమించు 64.38 శాతం నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కేవలం 27 భవనాల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతుండగా, ఆ పనులు కూడా నత్తనడకను తలపిస్తున్నాయి. 244 భవనాల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాకపోగా, పది భవన నిర్మాణాల పనులు వివిధ కారణాలతో అనుమతుల దశలో స్తంభించాయి.

సేవలకు ప్రశంసలు

● గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా పట్టణ, గ్రామ ప్రజలకు, రైతులకు, రోగులకు అందిన సేవలు అద్భుతం. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ నిర్మాణం, దాని ద్వారా అందిన సేవలను వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేశాయి. వివిధ దేశాలకు చెందిన వారు అభినందనలు కురిపించారు. వీటికి అనుబంధంగా వలంటీర్లు ఉండడంతో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటి గడపకే వచ్చి చేరాయి. 54 రకాల సేవలు నిరంతరాయంగా అందాయి. చివరకు భూముల రిజిస్ట్రేషన్లను కూడా ఇక్కడ మొదలు పెట్టారు.

● రైతులకు ఆర్‌బీకేల ద్వారా మేలైన సేవలందాయి. తమ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) వ్యవస్థతో రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలతో పాటు, పంటకు సాంకేతిక సహకారం, ధాన్యం కొనుగోలు, సాగు యాజమాన్య పద్ధతులు వంటివి పొందారు. వీటి ద్వారానే ధాన్యం కొనుగోలు పెద్దఎత్తున జరిగింది. కూటమి ప్రభుత్వం సైతం వీటి ద్వారానే కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఉచిత పంట బీమా, నష్ట పరిహారం, పంట బీమా పరిహారం ఇలా అన్నీ ఆర్‌బీకేల ద్వారా రైతులకు పెద్ద కష్టం లేకుండా అందాయి.

● విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా సమీపంలోనే మెరుగైన ఆరోగ్యం పొందగలిగారు. గ్రామంలో స్వల్ప రోగాలకు మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లకుండా, గ్రామంలో వైద్యం పొందే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. గతంలో 104 ద్వారా సేవలందించేవారు. కానీ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటు వల్ల స్థానికంగా వైద్య సదుపాయాలు పెరిగాయి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉన్నారు. జగనన్న సురక్ష ద్వారా వేలాది మంది రోగులకు ఉచిత ఓపీ, ఉచిత మందులు, కళ్లజోళ్లు అందాయంటే.. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు అక్కరకు వచ్చాయి.

72 ఆర్‌బీకేలు పూర్తయ్యేనా?

రైతులకు మేలు చేసే ఆర్‌బీకేల నిర్మాణాల పనులను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తం 247 ఆర్‌బీకేల నిర్మాణ లక్ష్యం రూ.56.49 కోట్లు. ఇందులో 157 ఆర్‌బీకేల నిర్మాణ పనులు పూర్తి కాగా, 8 నిర్మాణ దశలో ఉన్నాయి. 72 భవనాల నిర్మాణ పనులు మొదలు కాలేదు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో భవనం పునాదుల్లోనే నిలిచిపోయింది. చెట్లు కూడా మొలుస్తున్నాయి. ఇదొక్కటి చాలు ఆర్‌బీకేలను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో చెప్పడానికి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పాలన ప్రజలకు స్వర్ణయుగమనే చెప్పాలి. అదే స్థాయిలో.. అంతకుమించి పరిపాలనను, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చిన కార్యశీలి, పరిపాలనా దక్షుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, భావి పురోగతికి పునాదులు వేసి.. చేపట్టిన నిర్మాణాత్మక

కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. ప్రజలకు మేలు చేకూర్చే వీటన్నింటినీ సమాధి చేసేలా

తాజా కూటమి ప్రభుత్వం శాయశక్తులా శ్రమిస్తోంది.

హెల్త్‌ సెంటర్లకు కూటమి సుస్తీ

గ్రామీణ వైద్యానికి పెద్ద పీట వేసేందుకు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్లు నిర్మించాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భావించింది. జిల్లాలో 158 హెల్త్‌ క్లినికల్‌లు నిర్మాణం లక్ష్యం కాగా, ఇందుకు రూ.30.57 కోట్లను కేటాయించింది. 73 క్లినిక్‌ల నిర్మాణం పూర్తయ్యాయి. ఇందుకుగాను రూ.28.55 కోట్లు ఖర్చయింది. తొమ్మిది హెల్త్‌ క్లినిక్‌లు మాత్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా 76 క్లినిక్‌ల నిర్మించాల్సి ఉంది. అమలాపురం కామనగరువులో నిర్మిస్తున్న హెల్త్‌ క్లినిక్‌ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మొత్తం నిలిచిపోయాయి. వీటి తీరు చూస్తే నిర్మాణ దశలో ఉన్నవి సైతం పూర్తి చేసే పరిస్థితి లేదనే నమ్మకం జనంలో కలుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
గ్రామ స్వరాజ్యానికి సమాధి1
1/5

గ్రామ స్వరాజ్యానికి సమాధి

గ్రామ స్వరాజ్యానికి సమాధి2
2/5

గ్రామ స్వరాజ్యానికి సమాధి

గ్రామ స్వరాజ్యానికి సమాధి3
3/5

గ్రామ స్వరాజ్యానికి సమాధి

గ్రామ స్వరాజ్యానికి సమాధి4
4/5

గ్రామ స్వరాజ్యానికి సమాధి

గ్రామ స్వరాజ్యానికి సమాధి5
5/5

గ్రామ స్వరాజ్యానికి సమాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement