ఇంటర్ పరీక్షలకు 13,275 మంది హాజరు
అమలాపురం టౌన్: ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి శనివారం నిర్వహించిన మొదటి దశ నైతికత–మానవ విలువలు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 13,448 మంది విద్యార్థులకు గాను 13,275 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను డీఐఈఓ సందర్శించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పరీక్షలు జరుగుతున్న తీరుపై చర్చించారు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. పర్యావరణ విద్య పరీక్ష సోమవారం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
కల్యాణోత్సవాలకు పందిరిరాట ముహూర్తం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలో కొలువైన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్య కల్యాణోత్సవానికి శనివారం ఆలయ ప్రాంగణంలో పందిరి రాట ముహూర్తం చేశారు. దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గాభవానీ, మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొని పూజలు చేశారు. దేవస్థాన అర్చకులు, వేద పండితులు, అభిషేక పురోహితులు, చండీ పారాయణ, చండీ హోమదారులు వాయిద్య కారులతో ప్రత్యేక పూజలు చేసి రాట ముహూర్తం చేశారు. సహాయ కమిషనర్ దుర్గాభవాని మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకూ స్వామివారి కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.
శెట్టిబలిజ సంఘ మాజీ అధ్యక్షుడి మృతి
అల్లవరం: తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల కేంద్ర శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన దొమ్మేటి వెంకటస్వామి అనే బాబూరావు (80) మృతి శెట్టిబలిజ సామాజిక వర్గానికి తీరని లోటని ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అన్నారు. కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న బాబూరావు అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో బోడసకుర్రు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సర్పంచ్‌లు కడలి గంగాచలం, రాయుడు విష్ణు, ఎంపీటీసీ సభ్యులు గుబ్బల రంగనాథస్వామి, దొమ్మేటి శ్రీశాంతిభవాని, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. బోడసకుర్రులో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఫ శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి మనవడు దొమ్మేటి వెంకటస్వామి. ఇద్దరూ జాతి అభ్యున్నతికి కృషి చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ అన్నారు. ఆయన మృతి పట్ల విశ్వరూప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వరూప్‌తో పాటు కోనసీమ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరాసాహేబ్ శెట్టి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, టౌన్ అధ్యక్షుడు సంసాని నాని, వాసంశెట్టి తాతాజీ, వాసర్ల వెంకన్న, కుడుపూడి బాబు, విత్తనాల శేఖర్, గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు తదితరులు సంతాపం తెలిపారు.
వేలాదిగా శృంగార వల్లభుని సన్నిధికి..
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మాఘ మాసం తొలి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సుమారు 20 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.3,89,409 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 8 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment