ఆశలు... అడియాశలై...
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
జీఎస్టీ బాదుడు బడ్జెట్ ఇది
కేంద్ర బడ్జెట్‌తో బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఇది బడుగుల బడ్జెట్ కాదు, జీఎస్టీ బాదుడు బడ్జెట్. ప్రపంచ బ్యాంక్ సూచనలతో అప్పులకు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్. దీని రూపకల్పనలో సామాజిక కోణం లేదు. దేశ జనాభా దాదాపు 160 కోట్ల మంది ఉంటే అందులో 100 కోట్ల మందికి ప్రయోజనం చేకూరలేదు. –కుడుపూడి
సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ, అమలాపురం
వ్యాపారులకు మేలు ఎక్కడ
ఈ బడ్జెట్ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా మేలు జరగదు. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వీటిపై జీఎస్టీ తగ్గిస్తే బాగుండేది. అలాచేస్తే వ్యాపారులతోపాటు సామాన్యులు కూడా మేలు జరిగేది.
–దండుమేను రమేష్ కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ, అమలాపురం
సాక్షి, అమలాపురం: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. జిల్లాకు వరాల జల్లు కురిపిస్తారని అంతా అనుకున్నారు.. చివరికి కేటాయింపులు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రజలంతా నిరాశకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడంతో కొన్ని వర్గాలకు మేలు జరిగింది. ఇదే సమయంలో నిత్యావసరాలపై ఉన్న జీఎస్టీ తగ్గించకపోవడంపై వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. కిసాన్ రుణ పరిమితిని.. వడ్డీ రాయితీని పెంచడం అన్నదాతకు కొంత భరోసా కల్పించింది. ఇదే సమయంలో జిల్లాకు జీవనాడి కానున్న పోలవరం ప్రాజెక్టుకు అరకొర కేటాయింపులు, నిర్వాసితులకు సగం మాత్రమే పరిహార భారం మోస్తామనే ప్రకటన ప్రాజెక్టు భవిష్యత్‌పై దిగులు పెంచింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించకపోవడం జిల్లాలో నిరుద్యోగులు, రైతులను నిరాశ పరిచింది.
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర వార్షిక బడ్జెట్ 2025–26ను ప్రవేశ పెట్టారు. ఇందులో జిల్లాకు నేరుగా మేలు చేసే ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించలేదు. కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్‌కు కేటాయింపులు ఎంతనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది. అయితే జిల్లాలోని వివిధ వర్గాల వారిపై ఈ బడ్జెట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపనుంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.ఏడు లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ పెంచడంతో ఉద్యోగులు, చిరు వ్యాపారులకు మేలు జరగనుంది. జిల్లాలో సుమారు 25 వేల మంది వరకూ పన్ను చెల్లింపుదారులు ఉంటారని అంచనా. ఈ పెంపుతో 15 వేల మంది పన్ను భారం నుంచి తప్పించుకోనున్నారు.
గోదావరి డెల్టాను స్థిరీకరించే పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించారు. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు రావాల్సింది రూ.12,157 కోట్ల వరకూ ఉండడం గమనార్హం. నిర్వాసితుల పరిహారానికి సంబంధించి కేవలం 41.15 మీటర్ల నీటి నిల్వ వరకూ మాత్రమే ముంపు పరిహారం ఇస్తామని ప్రకటించారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి కొత్త ఆయకట్టు దేవుడెరుగు గోదావరి డెల్టాలో ఆయకట్టుకు సైతం పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి వస్తోందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సామాన్యుడు బతకడం ఇబ్బందిగా మారిన తరుణంలో వాటిపై జీఎస్టీ భారం తగ్గిస్తారని చిరు వ్యాపారులు, సామాన్యులు.. చేనేత ముడి సరుకుల మీద సైతం జీఎస్టీ తగ్గింపు ప్రకటన వస్తోందని ఆయా వర్గాల ప్రజలు ఎదురు చూశారు. అయినా ఫలితం లేకపోయింది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)లకు భారీగా కేటాయింపులు చేయడం యువతకు ఆసక్తిని రేపింది. కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి, 1.03 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 40 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు, సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇలా పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలో వాటి అనుంబంధ పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈలు కొంత వరకు మేలు చేస్తాయి. వాటితో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలు, విలువ ఆధారత పరిశ్రమలకు సైతం కేటాయింపులు మరింత పెంచడంతోపాటు సులభంగా రుణాలు, రాయితీలు ఇచ్చే చర్యలు తీసుకుంటే మేలు జరిగేదని వారు ఆభిప్రాయపడుతున్నారు.
కంటితుడుపు చర్యే
రైతులకు వ్యవసాయ రుణాల నిమిత్తం బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం కంటి తుడుపు చర్యే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.5 వేలు ఉన్నప్పుడే రుణ పరిమితి రూ. 3 లక్షలు ఉంది. ప్రస్తుతం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరానికి రూ. 45 వేల వరకూ రుణాలు ఇస్తున్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పెరిగిన స్థాయిలో రుణపరిమితిని పెంచలేదు. అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేస్తారని ఆశించాం. ఈ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు మొండిచేయి చూపారు.
–జున్నూరి రామారావు, ఏపీ అగ్రిమిషన్ మాజీ సభ్యుడు, డి.రావులపాలెం
ట్యాక్స్ పరిధి పెంచడం మంచిది
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025–26లో వ్యక్తిగత ఇన్ కమ్ ట్యాక్స్ పరిధిని రూ.12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం, కానీ నిరుద్యోగం అంశాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఎక్కువ నిధులు ఇచ్చి ఉంటే బాగుండేది.
–గుంటూరు అప్పారావు, హెచ్‌ఎం, మండల పరిషత్ నంబర్ వన్ ప్రాథమిక పాఠశాల, రాయవరం
అభివృద్ధి అంశాలెక్కడ!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయి. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను బడ్జెట్‌లో పూర్తిగా పక్కన పెట్టారు. విశాఖ రైల్వే జోన్, ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, వైజాగ్ మెట్రో తదితర అంశాలపై ప్రస్తావనే లేదు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం అసలు పట్టించుకోలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీలు నిలదీయాలి.
–వెంకటేశ్వరరావు,
సీపీఎం జిల్లా కన్వీనర్
ఫ కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
ఫ ఉద్యోగులు, మధ్య తరగతి వర్గాలకు ఊరట
ఫ రైతులు, వ్యాపారుల పెదవి విరుపు
పోలవరంపై భరోసా ఇవ్వలేదు
పోలవరం ప్రాజెక్టుపై ఎటువంటి భరోసా ఇవ్వలేదు. 41.15 మీటర్ల నీటి నిల్వ వరకూ మాత్రమే ముంపు పరిహారం ఇస్తామంటున్నారు. కానీ వాస్తవంగా 194.6 టీఎంసీల నీరు నిల్వ ఉంచితేనే ఈ ప్రాజెక్టుతో సంపూర్ణ ప్రయోజనం అందుతోంది. కానీ కేంద్రం మాత్రం 45.72 మీటర్ల ఎత్తున నీటి నిల్వ ఉంచితే మునిగిపోయే ప్రాంతాలకు ఇవ్వాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పకపోవడం, ఇందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడం అన్యాయం.
–కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి,
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment