5న ఫీజు పోరుకు సిద్ధంకండి
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పిలుపు
పి.గన్నవరం: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 5న అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఫీజు పోరు ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విద్యార్థులకు అమ్మకు వందనం, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలు చేయకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, వాటిని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విప్పర్తి, గన్నవరపు అన్నారు. నిరుద్యోగ యువత మాట ఎలా ఉన్నా.. పి.గన్నవరం నియోజకవర్గంలో మాత్రం కూటమి నాయకులకు నిరుద్యోగ భృతి కింద ఇసుక, మట్టి దోచుకోమని అగ్రనేతలు ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. ఫీజు పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, విద్యార్థుల తల్లిదండ్రులు తరలిరావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అనంతరం వారు ఫీజు పోరు పోస్టర్‌ను విడుదల చేశారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, మండల శాఖ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, కొమ్ముల రాము, కుడుపూడి విద్యాసాగర్, నాయకులు పేరి శ్రీను, మందపాటి కిరణ్‌కుమార్, అడ్డగళ్ల వెంకట సాయిరామ్, దొమ్మేటి వెంకట శివరామన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment