చదువుల పండగకు అంకురార్పణ
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరుని సన్నిధిలో చదువుల పండగ పేరుతో మూడు రోజులు పాటు జరిగే ప్రత్యేక క్రతువులకు ఆదివారం వేద పండితులు అంకురార్పణ చేశారు. తొలి రోజు ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి సప్తనదీ జలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధు, గోదావరి జలాలను ప్రత్యేక కలశాల్లో నింపి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు స్వామివారిని అభిషేకించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ పూజలు జరిపించారు. సోమవారం చదువుల పండగ పేరుతో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం స్వామివారి పాదాల చెంత లక్ష కలాలు ఉంచుతారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో ఆలయం పోటెత్తింది. తొలుత స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు చేశారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 68 మంది, లక్ష్మీగణపతి హోమంలో 23 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 110 మంది చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసాలు, తులాభారం వంటివి జరిపారు. 33 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. అన్నదాన పథకంలో 3,810 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి ఈ ఒక్కరోజే రూ.3,84,486 ఆదాయం సమకూరిందని ఈఓ సత్యనారాయణరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment