శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఫ భక్తులతో పోటెత్తిన వాడపల్లి
ఆత్రేయపురం: గోవిందా.. హరి గోవిందా నామస్మరణ మార్మోగింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం కార్తిక మాసం శనివారం సందర్భంగా కిక్కిరిసింది. ఉదయం స్వామివారిని వేదపండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. తొలుత సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యహవచనం తదితర పూజాదికాలు చేశారు. ఏడు శనివారాల నోము ఆచరించిన భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్నసమారాధన నిర్వహించారు. సుమారు 45 వేల నుంచి 50 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు రూ.36,66449 ఆదాయం సమకూరింది. దేవదాయ ధర్మదాయ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ నల్లం సూర్య చక్రధర్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రద్దీ నెలకొంది. ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment