ఆహారం.. ఆరోగ్యం
సహజ ఎరువులు, కషాయాలతోనే...
ప్రకృతి సాగుకు సహజంగా లభించే పదార్థాలు, ద్రవాలతో తయారు చేసిన ఎరువులు, క్రిమిసంహారక కషాయాలను వినియోగిస్తున్నారు. రసాయనిక ఎరువుల కంటే ఇవి తక్కువ ఽఖర్చు అవుతోంది. ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, శెనగపిండి వంటి పదార్థాలతో ఘన, ద్రవ, జీవామృతం తయారు చేస్తున్నారు. పంటలపై ఆశించే పురుగులు, చీడపీడల నివారణకు పురుగు మందుల స్థానంలో నీటిని కలిపి తయారు చేసిన ద్రవ జీవామృతాన్ని వినియోగిస్తున్నారు. వరిలో అగ్గి తెగులు, సుడిదోమ, వైరస్ నివారణకు పేడ కషాయం, పురుగుల నివారణకు అగ్నిఅస్త్రం వంటి కషాయాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి, అరటి, వరి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు.
ఫ ప్రకృతి సాగుతో మేలైన ఉత్పత్తులు
ఫ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం
ఫ క్రమేపీ పెరుగుతున్న సాగు విస్తీర్ణం
కొత్తపేట: జీవన శైలి మారింది.. ఆహార అలవాట్లు మారాయి.. దీనికి తోడు అనారోగ్య సమస్యలూ అధికమయ్యాయి. మనం తీసుకునే ఆహారాన్ని అధిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేయడంతో వ్యాధుల కారకంగా మారుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రకృతి సాగుకు ప్రాధాన్యం పెరిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో రసాయన రహిత విధానాలకు ఆదరణ వచ్చింది. దీనిపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆ మేరకు అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, చీడపీడల నివారణకు వినియోగించే కషాయాల తయరీపై అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో 1,03,251 మంది రైతులు ఉన్నారు. వీరు మొత్తం 1,06,030 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 50 శాతం మంది పూర్తిగా రసాయనిక, పురుగు మందులను వినియోగిస్తున్నారు. మరో సగం మంది ప్రకృతి వ్యవసాయ విధానంతో పాటు రసాయన ఎరువులను వాడుతున్నారు. మూడు జిల్లాల్లో పూర్తిగా ప్రకృతి సేద్యాన్ని 21,417 ఎకరాల్లో 20,983 మంది రైతులు చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి గణనీయంగా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు రసాయనిక సాగులో ఎరువులు, పురుగు మందులకు సుమారు రూ.15 వేలు ఖర్చయితే.. ప్రకృతి వ్యవసాయంలో సుమారు రూ.4 వేలు మాత్రమే అవుతోంది.
డాక్టర్ వైఎస్ హయాంలోనే..
ప్రకృతి వ్యవసాయ విభాగం 2008లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకుంది. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను పండించేలా రైతులను చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో అప్పట్లో నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) ఆవిర్భవించింది. 2015లో రైతు సాధికార సంస్థగా మారి, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం– జెడ్‌బీఎన్‌ఎఫ్)గా మార్పు చెందింది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ సంస్థను మరిన్ని సౌకర్యాలు, ప్రయోజనకర పథకాలతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఎపీసీఎన్‌ఎఫ్)గా అభివృద్ధి చేసింది. క్షేత్ర స్థాయిలో ప్రకృతి సేద్యం పట్ల రైతులను చైతన్యవంతులను చేయడానికి మెంటర్లు, ఫార్మర్ సైంటిస్టులు, మోడల్ మేకర్‌లను తయారు చేయడానికి 2022లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కడప జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఆగ్రో ఎకోలజీ అండ్ రీసర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీజీఏఏఆర్‌ఎల్)ను ఏర్పాటు చేసింది.
పచ్చదనం నింపేందుకు..
సాగు భూముల్లో 365 రోజులు ఏదో ఒక వ్యవసాయ, ఉద్యాన పంటలతో పచ్చదనం కొనసాగడమే ప్రకృతి వ్యవసాయ విభాగం లక్ష్యం. క్రమేపి రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి, ఘన, ద్రవ, కషాయాల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి రైతులూ ప్రాధాన్యం ఇస్తున్నారు.
–జె.ఎలియాజర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయం
చైతన్యవంతులను చేస్తున్నాం
ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చు. జీవన ఎరువులు, కషాయాలు తయారీపై గ్రామాల్లో అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నాం. రైతులను చైతన్యవంతులను చేస్తున్నాం. ప్రతి ఏడాదీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రకృతి సేద్యంలో పండించిన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
–కముజు అరుణకుమారి,
ఫార్మర్ సైంటిస్టు, బిళ్లకుర్రు
Comments
Please login to add a commentAdd a comment